ప్రభాస్‌  హీరోగా ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో గోపీకృష్ణా మూవీస్‌, యువి క్రియేషన్స్‌ సంయుక్తంగా ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ నెల 13 నుంచి ఈ చిత్రం తాజా షెడ్యుల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ కు చాలా ప్రత్యేకత ఉంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఈ షెడ్యూల్ లో ప్రభాస్ తో చేయనున్నారు. ఈ ప్రేమకథా చిత్రం హిందీ వెర్షన్ సైతం భారీ ఎత్తున రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న నేపధ్యంలో బాలీవుడ్ నటీనటులను తీసుకువస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ కు తల్లిగా భాగ్యశ్రీ నటిస్తోంది.  అలాగే ఈ సినిమాలో విలన్ గా ప్రముఖ బాలీవుడ్ నటుడు మిధున్ చక్రవర్తి చేస్తున్నట్లు సమాచారం. ఇద్దరి మధ్యా వచ్చే సన్నివేశాలను  ఈ తాజా షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. ఈ షూట్ లో భాగంగా ప్రభాస్ కు, మిధున్ చక్రవర్తికి ఓ ఛాలెంజ్ లాంటిది వస్తుందని చెప్తున్నారు. దాని చుట్టూనే కథ తిరుగుతుందని చెప్తున్నారు.

అయితే ఈ విషయమై ఇంకా అఫీషియల్ సమాచారం లేదు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.  హైదరాబాద్ సిటీలోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా మూడు కోట్ల రూపాయలతో వేసిన సెట్‌లో  కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత ఆస్ట్రియా వెళ్లనున్నారు. ‘‘తెలుగు తెరపై ఇప్పటివరకూ ఇటువంటి ప్రేమకథా చిత్రం రాలేదు. ఇది చారిత్రక చిత్రం కాదు. ప్రభాస్‌, పూజా హెగ్డే మధ్య రొమాంటిక్‌ సన్నివేశాలు పవర్‌ఫుల్‌గా, ఇంటెన్స్‌గా ఉంటాయి. ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తాయి’’ అని దర్శకుడు రాధాకృష్ణ తెలిపారు.

1970లో సాగే ప్రేమకథతో ఈ చిత్రం ఉంటుంది, ఈ సినిమా తొలి షెడ్యూల్‌ ఇటలీలో జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరగుతోంది. ఇందుకోసం ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీందర్‌ 1970 నాటి కాలం ప్రతిబింబించేలా సెట్‌ను తయారు చేశారు. ఈ సినిమాలో కృష్ణంరాజు కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తారని టాక్‌. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయడానికి చిత్రం టీమ్ ప్లాన్‌ చేస్తోందని తెలిసింది.