సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు. భరత్ అనే నేను, మహర్షి లాంటి సాఫ్ట్ కథలతో అలరించిన మహేష్ ఈసారి తన అభిమానులకు మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. 

ఇటీవల విడుదలైన సరిలేరు నీకెవ్వరు చిత్ర టీజర్ అభిమానులని విశేషంగా ఆకట్టుకుంది. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై టీజర్ అంచనాలు పెంచేసింది. రిలీజ్ కు తక్కువ సమయం ఉండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలని వేగవంతం చేసింది. 

ఇక నుంచి ప్రతి సోమవారం సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని ఒక్కో సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ప్రకటించిన విధంగానే కొద్దిసేపటి క్రితమే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. 'మైండ్ బ్లాక్' అంటూ సాగే ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ మాస్ బీట్ అందించాడు. 

తొలి సాంగ్ ని మాస్ ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినట్లు ఉంది. మహేష్ ని మాస్ లుక్ లో చూడాలని భావించే అభిమానుల కోరిక ఈ పాటతో తీరబోతోంది. ఈ మాస్ నంబర్ కు శ్రీమణి, దేవిశ్రీ ఇద్దరూ సాహిత్యం అందించారు. బ్లాజే, రనీనా రెడ్డి ఈ సాంగ్ కు సింగర్స్. మొత్తంగా సరిలేరు నీకెవ్వరు పాటల సందడి హుషారెత్తించే సాంగ్ తో మొదలైందని చెప్పొచ్చు. 

మహేష్ బాబు సరసన తొలిసారి రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.