రేలంగి సినిమాల్లోకి వచ్చి  వృధ్ది అయ్యినా తన గతాన్ని మర్చిపోవటానికి ఇష్టపడేవాడు. తన అప్పటి కష్టాలను, కష్టాలలో ఆదుకున్న స్నేహితులను మరచిపోలేదు. సినిమా ట్రైల్స్ రోజుల్లో  తిండితిప్పలు ఇబ్బంది పడినవాడు కనుక, తను భోజనం చేసేటప్పుడు కనీసం పాతికమందికి భోజనం పెట్టేవారు.  అలాగే తనకు చదువు అబ్బలేదు కనుక చదువుకోసం ఆర్దికసహాయం అర్దించే వాళ్లకు చేయూత ఇచ్చేవారు. రేలంగి ఏనాడూ ధనమదంతో విర్రవీగలేదని ఆయన్ను ఎరిగున్న వాళ్లు చెప్తారు.

రేలంగి ప్రారంభ రోజుల్లో మద్రాసులో కాలినడకన మైళ్ళకొద్దీ నడిచేవాడు. అది గుర్తు పెట్టుకుని తను స్టూడియో నుంచి ఇంటికి వెళుతూ ఎంతోమందికి లిఫ్ట్‌ ఇచ్చేవారు.  అలాగే ఆ రోజుల్లో తను స్టూడియోలకు,షూటింగ్ స్పాట్స్ లకు తిరగటానికి అండగా నిలిచిన పాత సైకిల్‌ని భద్రంగా దాచుకున్నారు. ఆ సైకిలు అంటే ఆయనకు చాలా మక్కువ. అప్పుడప్పుడూ తన ప్రెండ్స్ తో...ఎప్పుడైనా నాకు వేషాలు లేక, సినిమా ఇండస్ట్రీని వదిలేసి వెళ్లే పరిస్దితి కనుక వస్తే... యీ ఆస్తిపాస్తులన్నీ ఎక్కడివక్కడ వదిలేసి, ఈ సైకిలు తొక్కుకుంటూ తన ఊరైన తాడేపల్లిగూడెం వెళ్లిపోతాను’ అని అనేవారు. అలా ఆ సైకిలు ఆయన తోడుగా జీవితాంతం ఉంది.

రేలంగి కోపం..

జీవితంలో చిన్న స్దాయి నుంచి వచ్చి పైకి ఎదిగిన రేలంగికి మద్యపానం, ధూమపానం వంటి వ్యసనాలు లేవు. కానీ అప్పట్లో సంచలన వార్తలకు, అవాస్తవమైన రాతలకు, ఎల్లో జర్నలిజానికి పెట్టింది పేరైన  ‘కాగడా’అనే పత్రిక  ఉండేది. ఆ పత్రికకి హోల్ అండ్ సోల్ ప్రొప్రైటర్ కమ్ ఎడిటర్ శర్మ. ఆ పత్రికలో అన్ని ఇప్పుడు యూట్యూబ్ లో వస్తున్న తరహాలో సంచలనం కోసం క్రియేట్ చేయబడ్డ  వార్తలు వస్తూండేవి.  ఒకసారి  తన పత్రికలో సెన్సేషన్ క్రియేట్ చేయటం కోసం  ‘రేలంగి తాగి తందానా లాడతాడు’ అంటూ చాలా దారుణంగా..  అసభ్యమైన భాషలో రాశాడు.

ఆ పత్రిక మార్కెట్ లోకి వచ్చిన మరుసటిరోజు స్టూడియోలో షాట్‌ బ్రేక్‌లో కాగడా శర్మ రేలంగికి ఎదురయ్యాడు. వెంటనే రేలంగి అతడి చెంప చెళ్లు మనిపించాడు. దాంతో రేలంగిపై తనను కొట్టాడని పోలీసు కేసు పెడతానని అన్న కాగడా శర్మను తోటి జర్నలిస్టులు మందలించి చీవాట్లు పెట్టారు. అప్పటినుంచి కాగడా శర్మ...రేలంగికు చాలా దూరంగా ఉండేవాడు.తన పత్రికలో కూడా రేలంగి ఊసు ఎత్తేవాడు కాదు.