ఖైదీ నెంబర్ 150తో మెరుపులా రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత సైరా చిత్రం కోసం చిరంజీవి ఎక్కువ టైం తీసుకున్నారు. ఇకపై గ్యాప్ లేకుండా సినిమాలు చేసేందుకు చిరు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. చిరంజీవితో సినిమాలు చేసేందుకు స్టార్ డైరెక్టర్ రెడీగా ఉన్నారు. 

కానీ చిరు మాత్రం యంగ్ డైరెక్టర్స్ ని ఎంచుకుంటుండడం, అది కూడా ఫ్లాప్స్ లో ఉన్నవారిని ఎంచుకోవడం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం చిరు కొరటాల శివ దర్శత్వంలో ఆచార్య అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత చిరు తన ఫ్యూచర్ ఫ్లాన్స్ ని రివీల్ చేశారు. 

అనూహ్యంగా సుజిత్ దర్శత్వంలో చిరంజీవి నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో చిరు క్లారిటీ ఇచ్చారు. లూసిఫెర్ రీమేక్ కోసం సుజీత్ తో సంప్రదింపులు జరుపుతున్న విషయాన్ని చిరంజీవి తెలిపారు. అదే విధంగా యువ దర్శకుడు బాబీ కూడా ఓ కథ చెప్పాడని చిరు అన్నారు. 

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. వరుస పరాజయాలతో సినిమాలేవీ లేకుండా ఖాళీగా ఉన్న మెహర్ రమేష్ కూడా చిరుతో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. మెహర్ రమేష్ కూడా తనకు కథ చెప్పినట్లు చిరంజీవి తెలిపారు. చిరంజీవి కోసం స్టార్ డైరెక్టర్స్ ప్రయత్నిస్తుంటే ఆయన మాత్రం కుర్ర దర్శకులని ఎంపిక చేసుకుంటున్నారనే అనుమానాలు ఉన్నాయి.

ఈ విషయంలో కూడా చిరు క్లారిటీ ఇచ్చారు. ఈ తరం దర్శకులు కొత్త కొత్త ఆలోచనలతో వస్తున్నారని, ఇప్పటి యువతకు నచ్చేలా సినిమాలు తెరకెక్కించడం యువ దర్శకులకు బాగా తెలుసు అని చిరంజీవి అన్నారు.