మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా.. ఆయన ఓ సినిమా ఈవెంట్ కి వస్తున్నారంటే.. కచ్చితంగా ఏదొక స్పెషాలిటీ ఉండే ఉంటుంది. మెగాస్టార్ ఎంట్రీతో ఆ సినిమాపై బజ్ కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు ఓ కుర్ర హీరో సినిమాకి బజ్ తీసుకొచ్చే సాయం చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.

ఠాగూర్ మధు, ఆకెళ్ళ రాజ్ కుమార్ నిర్మించిన 'అర్జున్ సురవరం' సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. నిఖిల్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో ఓ కీలకమైన సామాజిక సమస్యని డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. ఠాగూర్ మధు, చిరంజీవిలకు మధ్య స్నేహం ఉంది. అదే స్నేహంతో 'అర్జున్ సురవరం' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి రావడానికి ఏమైనా అవకాశం ఉందా అని మెగాస్టార్ ని కోరినట్లు తెలుస్తోంది.

దానికి చిరంజీవి.. ముందుగా సినిమా చూస్తానని అడిగారట. వెంటనే ఆ మేరకు ఏర్పాట్లు చేయడం జరిగిపోయింది. సినిమా చూసి సమస్యని డీల్ చేసి, మంచి మెసేజ్ ఇచ్చారని నిర్మాతలకు ప్రశంసించిన చిరంజీవి ఈవెంట్ కి వస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరో రెండు, మూడు రోజుల్లో ఈ సినిమా ఈవెంట్ ని నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఠాగూర్ మధు, ఆకెళ్ళ రాజ్ కుమార్ ఇద్దరితో చిరంజీవికి మంచి బాండింగ్ ఉంది. అందుకే వారు నిర్మించిన సినిమాని ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. హీరో నిఖిల్ కి ఇది కలిసొచ్చే విషయమే..

నిజానికి ఈ సినిమా చాలా కాలంగా రిలీజ్ కి నోచుకోకుండా నలిగిపోతోంది. దీంతో సినిమాపై బజ్ తగ్గిపోయింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ బాగున్నప్పటికీ పాజిటివ్ బజ్ అయితే  తీసుకురాలేకపోయింది. ఇప్పుడు నేరుగా చిరంజీవి ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగుతున్నారంటే.. కచ్చితంగా సినిమాపై బజ్ క్రియేట్ అవుతుందనే చెప్పాలి.