నేడు స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి. ఈ సందర్భంగా అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు ఎన్టీఆర్ ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. బాలకృష్ణతో పాటు ఇతర ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఇప్పటికే ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే. 

మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ ని స్వర్మించుకుంటూ ట్విట్టర్ లో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. 'తెలుగు జాతి  పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం  తెలుగు నేల  గుండెల్లో  ఎన్నటికీ  చెదరని జ్ఞాపకం  నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం.  వారితో కలిసి నటించడం నా అదృష్టం.  పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ..' అని చిరంజీవి ట్వీట్ చేశారు. 

ఎన్టీఆర్ తనకి, తాను ఎన్టీఆర్ కి స్వీట్ తినిపిస్తున్న ఫోటోని చిరంజీవి షేర్ చేశారు. చిరంజీవి, ఎన్టీఆర్ కలసి 1981లో తిరుగులేని మనిషి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అలాగే చిరంజీవి నటించిన అల్లుడా మజాకా చిత్ర ఓపెనింగ్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ఏపీ సీఎం.