స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ ఒదిగిపోయి నటించారు. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి దూసుకుపోతున్నారు. ఖైదీ నెం150, ఆ తర్వాత వచ్చిన సైరా చిత్రాలు ఘనవిజయం సాధించాయి. 

ప్రస్తుతం మెగాస్టార్ కొరటాల దర్శత్వంలో కొత్త చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి గోవింద ఆచార్య, గోవిందా హరి గోవిందా లాంటి టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 

ఈ చిత్రం కోసం కాస్త బరువు తగ్గాలని కొరటాల శివ చిరంజీవికి సూచించారట. దీనితో మెగాస్టార్ జిమ్ లో వాలిపోయారు. ఆరు పదుల వయసులో జిమ్ లో కసరత్తులు చేస్తూ శ్రమిస్తున్నారు. చిరంజీవి జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఫోటో ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. 

ఫిజికల్ ట్రైనర్ ఆధ్వర్యంలో చిరంజీవి బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక డైట్ ని కూడా ఫాలో అవుతున్నారు. అంటే త్వరలోనే క్రేజీ లుక్ లో మెగాస్టార్ ని చూడొచ్చు. 

కొరటాల శివ తెరకెక్కించబోయే ఈ చిత్రం దేవాదాయశాఖకు సంబంధించిన కథాంశంతో ఉండబోతోంది. ఈ చిత్రంలో చిరంజీవి దేవాదాయశాఖలో పనిచేసే ఉద్యోగిగా నటించనున్నారు. ఆ శాఖలో జరిగే అవినీతిని కొరటాల శివ ఈ చిత్రంలో చూపించబోతున్నారు. రాజకీయ నాయకులూ దేవుడు భూములని ఎలా కబ్జాచేస్తున్నారు.. ఆస్తులని ఎలా కొల్లగొడుతున్నారు లాంటి అంశాలని కొరటాల శివ ఆసక్తికరంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ అవినీతిని ఎదుర్కొనే క్రమంలో మెగాస్టార్ బడా పొలిటీషియన్లతో తలపడబోతున్నట్లు తెలుస్తోంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ కి హీరోయిన్ గా త్రిషని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.