భల్లాల దేవుడు రానా దగ్గుబాటి ప్రస్తుతం సోషల్  మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాడు. మంగళవారం రోజు రానా సోషల్ మీడియాలో అనూహ్యమైన ప్రకటన చేశాడు. తనకు కాబోయే భార్యని పరిచయం చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 

దీనితో రానాకు సౌత్ తో పాటు, బాలీవుడ్ ప్రముఖుల నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రానా ప్రేయసి పేరు మిహీక. ఆమె ముంబైలో ఈవెంట్ మేనేజ్మెంట్ వ్యాపారంలో రాణిస్తున్నారు. కొంత కాలంగా రానా, మిహీక  ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. 

నా ప్రేమకు ఆమె అంగీకారం తెలిపింది అంటూ రానా మిహీకాతో రొమాంటిక్ గా చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోపై నితిన్, దుల్కర్ సల్మాన్, కాజల్, కియారా అద్వానీ, సమంత, రాశి ఖన్నా లాంటి సెలెబ్రిటీలంతా కామెంట్స్ కురిపిస్తున్నారు. ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా రానా ప్రేమ వ్యవహారంపై సరదాగా స్పందించారు. భల్లాల దేవుడికి చివరకు ప్రేయసి దొరికింది. కంగ్రాట్స్ మే బాయ్.. లాక్ డౌన్ కాస్త వెడ్ లాక్ అయింది. శతమానం భవతి అని చిరు ట్వీట్ చేశారు. తనతో పాటు సురేఖ, రాంచరణ్ లతో రానా ఉన్న అపురూపమైన ఫోటోని చిరు షేర్ చేశారు.