సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవి యమా యాక్టివ్‌గా ఉంటున్నాడు. తన అభిమానులకు ఈ సమయంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించటంతో పాటు తన పర్సనల్ ఇంట్రస్ట్‌లను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు. అదే సమయంలో కొన్ని ఫన్నీ ట్వీట్స్‌తో అభిమానులను ఎంటర్‌టైన్‌ చేస్తున్నాడు. తాజాగా తన కొడుకు రామ్‌ చరణ్‌ను ఉద్దేశిస్తూ మరో ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి.

ఇటీవల మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో నాన్నమ్మ దగ్గర వెన్న తీయటం ఎలాగో నేర్చుకుంటున్న వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను మెగా అభిమానులు తెగ వైరల్‌ చేశారు. తాజాగా ఇదే వీడియోపై మెగాస్టార్ స్పందించాడు. `మై డియర్ బచ్చా... మా అమ్మ దగ్గర నీ `బట్టర్` ఉడకదురా. ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు నాదే. నువ్వు ఎంత బటర్‌ వేసినా.. నీ పోజిషన్ మాత్రం బెటర్‌ కాదు. అయితే మీ అమ్మ దగ్గర నాకు ఈ గ్యారెంటీ లేదనుకో` అంటూ ఫన్నీ ఎమోజీతో ట్వీట్ చేశాడు చిరు.

లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవటంతో చిరు, చరణ్‌లు ఇద్దరు ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తుండగా, రామ్ చరణ్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.