ఉగాది సందర్భంగా టాలీవుడ్ ప్రేక్షకులకు అరుదైన గిప్ట్ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఇన్నాళ్లు అభిమానులతో ప్రత్యక్ష్యంగా కాంటాక్ట్ లో లేని మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు నుంచి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులోకి వచ్చాడు. ఈ రోజు ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన మెగాస్టార్‌ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశాడు. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో మాట్లాడటం ఎంతో ఆనందంగా ఉందన్న చిరు, కరోనా మహమ్మారిని జయించటటానికి కలిసి కట్టుగా కంకణం కట్టుకుందామని పిలుపు నిచ్చాడు.

ఇక తన రెండో ట్వీట్‌ గా ప్రధాన మంత్రి మోడి ప్రకటించిన 21 రోజుల లాక్‌ డౌన్‌కు అందరూ సహకరించాలని పిలుపునిచ్చాడు. 21 రోజులు అందరినీ ఇళ్లలోనే ఉండమని భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం కరోనా మహమ్మారిని ఎదుర్కొనటానికి ఓ అనివార్య చర్య అని అభిప్రాయపడ్డాడు చిరు. ఇంటి పట్టునే ఉందాం. సురక్షితంగా ఉందాం అంటూ అభిమానులకు పిలుపునిచ్చాడు మెగాస్టార్ చిరంజీవి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఖైదీ నంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ఆ సినిమా సూపర్‌ హిట్ అందుకున్నాడు. తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకొని తన డ్రీమ్‌ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం కొరాటల శివ దర్శకత్వంలో ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు చిరు. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నాడు.