కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. దాదాపు ప్రపంచ దేశాలన్నీ ఈ వైరస్‌ భయంతో గజ గజ లాడుతున్నాయి. ప్రజలంతా తమకు వైరస్ అంటకూడదన్న భయంతో ఇళ్లలోనే ఉండిపోతున్నారు. ప్రభుత్వాలు కూడా ప్రజలు బయటకు రాకుండా కఠినమైన ఆంక్షలు విధించాయి. అయితే ఈ ప్రమాధకర పరిస్థితుల్లోనే డాక్టర్లు, పోలీసులు, పారిశుద్య కార్మికులు తమ ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు. వాళ్ల సేవలను గుర్తిస్తూ దేశ ప్రజలంతా ఒకేసారి చప్పట్లు కొట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.

అయినా వారు చేస్తున్న సేవలకు ఎంత చేసిన తక్కువే అని భావించిన పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా వారు చేస్తున్న సేవలను కీర్తిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఇప్పటికే సూపర్‌ స్టార్ మహేష్ బాబు పోలీస్‌ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. అదే బాటలో ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో సందేశాన్ని తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశాడు.

`రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల పని తీరు అద్భుతం. నిద్రా హారాలు కూడా మాని వారు పడుతున్న ఈ కష్టం అంతా ఇంతా కాదు. నేను హైదరాబాద్‌లోనే స్వయంగా చూస్తున్నాను. వారి పని తీరువల్ల లాక్‌ డౌన్‌ చాలా సక్సెస్‌ఫుల్‌గా జరిగిందనే చెప్పాలి. అలా జరగబట్టే కరోనా విజృంభన చాలా వరకు అదుపులోకి వచ్చింది` అంటూ ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు చిరు. ఇక బాలీవుడ్‌ లో అయితే దిల్ సే థ్యాంక్యూ #DilSeThankYou అంటూ క్యాంపెయిన్‌నే నడుపుతున్నారు స్టార్స్‌.