మెగాస్టార్ చిరంజీవితో పాటు, తాను కూడా అభిమానుల శ్రేయస్సు కోసం కట్టుబడి ఉంటామని రామ్ చరణ్ మరోసారి నిరూపించాడు. కొన్ని రోజుల క్రితం మెగా ఫ్యామిలీ వీరాభిమాని.. హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు నూర్ మహమ్మద్ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. 

దశాబ్దాల కాలంగా నూర్ మహమ్మద్ మెగాస్టార్ చిరంజీవికి అభిమాని. హైదరాబాద్ లో చిరంజీవి యువత అధ్యక్షడిగా వివిధ కార్యక్రమాల్లో నూర్ మహమ్మద్ చురుగ్గా పాల్గొనేవారు. నూర్ మహమ్మద్ మరణించిన తర్వాత చిరంజీవి, రాంచరణ్, అల్లు అర్జున్ ఆయన కుటుంబ సభ్యులని పరామర్శించిన సంగతి తెలిసిందే. 

ఆ సమయంలో రామ్ చరణ్ నూర్ మహమ్మద్ కుటుంబసభ్యులకు రూ 10 లక్షలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నేడు చరణ్ నూర్ మహమ్మద్ కుటుంబ సభ్యులకు 10 లక్షల విరాళం అందించాడు. స్వయంగా రాంచరణ్ ఆదివారం రోజు నూర్ మహమ్మద్ ఇంటికి వెళ్లి చెక్కు అందించాడు. కాసేపు వారితో మాట్లాడి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. 

ఇదిలా ఉండగా రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ఈ చిత్రంలో అల్లూరి సీతా రామరాజు పాత్రలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది.