టాలీవుడ్ లో ఉన్న జీనియస్ డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరు. తన ప్రతి చిత్రం వైవిధ్యంగా ఉండాలనేది ఆయన ఆలోచన. విజయం సాధించినా, సాధించకపోయినా సుకుమార్ చిత్రాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. గత ఏడాది రాంచరణ్ హీరోగా నటించిన రంగస్థలం చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించాడు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులని సృష్టించిన సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఆసక్తికర చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక మందన రొమాన్స్ చేయబోతోంది. భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తుండడం విశేషం. 

ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. మెగా డాటర్ నిహారిక ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోందట. రంగస్థలం చిత్రంలో అనసూయ రంగమ్మత్త పాత్ర ఎంత హైలైట్ గా నిలిచిందో బన్నీ చిత్రంలో నిహారిక పాత్ర అంతకు మించి ఉండబోతోందని టాక్. 

కథలో కీలక మార్పుకు కారణమయ్యే పాత్ర కోసం సుకుమార్ అన్వేషిస్తుండగా.. బన్నీ నిహారికని రికమండ్ చేసినట్లు తెలుస్తోంది. సుకుమార్ కూడా ఓకే చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు వాస్తవమో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. 

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ కంప్లీట్ గా కొత్తగా గెటప్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.