మెగా బ్రదర్ నాగబాబు ఇన్నిరోజులపాటు బుల్లితెర రారాజుగా వెలిగారు. ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ తో ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జబర్దస్త్ షో ప్రారంభమైనప్పటి నుంచి నాగబాబు, రోజా న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. 

జబర్దస్త్ అనగానే కామెడీ స్కిట్ లతో పాటు నాగబాబు, రోజా జోడి కూడా గుర్తుకు వస్తుంది. వీరిద్దరూ జబర్దస్త్ నటులు,ఇతర టీమ్ తో ఎమోషనల్ గా అటాచ్ అయిపోయారు. ముఖ్యంగా నాగబాబు అంటే సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, హైపర్ ఆది లాంటి నటులంతా ఎంతో అభిమానం చూపిస్తారు. నాగబాబు కూడా వారిని నిత్యం ప్రోత్సహిస్తుంటారు. నాగబాబు మధ్యలో కొన్ని సార్లు జబర్దస్త్ షో నుంచి తాత్కాలిక బ్రేక్ తీసుకున్నా మళ్ళీ వచ్చి అలరించే వారు. 

కానీ తాజాగా అందుతున్న సమాచారం జబర్దస్త్  అభిమానులకు బిగ్ షాక్ అనే చెప్పాలి. నాగబాబు జబర్దస్త్ షో నుంచి శాశ్వతంగా తప్పుకున్నట్లు తెలుస్తోంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలు గురు, శుక్రవారాల్లో ప్రసారం అవుతున్నాయి. నాగబాబు, రోజా నవ్వులు ఒక సిగ్నేచర్ లా మారిపోయాయి. కానీ ఇక నాగబాబు నవ్వులు జబర్దస్త్ షోలో కనిపించబోవడం లేదు. 

ప్రస్తుతం నాగబాబు కనిపిస్తున్న ఎపిసోడ్స్ అన్ని ఆల్రెడీ షూట్ చేసినవి. కొన్ని ఎపిసోడ్స్ తర్వాత నాగబాబు జబర్దస్త్ షోలో కనిపించరు. దీనికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జబర్దస్త్ డైరెక్టర్స్ విషయంలో నాగబాబు యాజమాన్యంతో విభేదించినట్లు తెలుస్తోంది. 

ఇప్పటి వరకు జబర్దస్త్ షోని నితిన్- భరత్ లు డైరెక్ట్ చేస్తూ వచ్చారు. వారికీ యాజమాన్యంతో విభేదాలు తలెత్తాయి. దీనితో మేనేజ్మెంట్ వారిని తప్పించినట్లు సమాచారం. నాగబాబుతో వారిద్దరో మంచి సాన్నిహిత్యంతో ఉండేవారు. ఈ విషయంలో నాగబాబు మేనేజ్మెంట్ పై మనస్తాపానికి గురయ్యారట. 

తాను కూడా జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నట్లు యాజమాన్యానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. నాగబాబుతో పాటు చమ్మక్ చంద్ర కూడా జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నట్లు టాక్. ఇన్నేళ్ళపాటు బుల్లితెర అభిమానులని అలరిస్తూ వచ్చిన జబర్దస్త్ షోలో ఇలాంటి పరిణామాలు జరగడం ఆందోళన కలిగించే అంశమే. మేనేజ్మెంట్ నాగబాబుని బుజ్జగించి వెనక్కి పిలుస్తారా లేక వేరే జడ్జిని పెట్టుకుంటారా అనేది వేచి చూడాలి.