సినిమా ఇండస్ట్రీలో బంధుప్రీతి ఎక్కువగా ఉంటుందని, వారసులే ఇండస్ట్రీని ఏలుతుంటారని బయటవాళ్లకు అవకాశాలు రానివ్వరని ఇలా చాలా మాటలు వినిపిస్తుంటాయి. తాజాగా ప్రముఖ వివాదాస్పద తమిళనటి మీరా మిథున్ కోలీవుడ్ లో నెపోటిజం ఉందని చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. విలక్షణ నటుడు కమల్ హాసన్ పై మీరా ఆరోపణలు చేస్తున్నారు.

మీరా హీరోయిన్ గా 'అగ్ని సిరాగుగల్' అనే సినిమాలో నటించాల్సివుంది. అయితే ఆ సినిమాలో ఆమెను తీసుకున్నట్లే తీసుకొని ఆ తర్వాత తీసేశారట. ఆమె స్థానంలో కమల్ హాసన్ చిన్న కూతురు అక్షరా హాసన్ ని ఎంపిక చేసుకున్నారట. ఈ క్రమంలో కమల్ హాసన్ అనుకున్నది సాధించారంటూ మీరా ట్విట్టర్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది. కోలీవుడ్ లో నెపోటిజం పీక్స్ లో ఉందనే విషయం నిజమైందని.. సినిమా నుండి తనను తప్పించి కమల్ తన కూతురికి అవకాశం వచ్చేలా చేశారని చెప్పుకొచ్చింది.

ఇలా చేసినందుకు దర్శకుడు నవీన్ కి, అక్షర హాసన్ కి, నిర్మాత శివకి సిగ్గుగా అనిపించడం లేదా..? అని ప్రశ్నించింది. మీరా చేసిన ఆరోపణలపై స్పందించిన దర్శకుడు నవీన్.. ఈ సినిమా కోసం మొదట షాలిని పాండేని ఎంపిక చేసుకున్నామని ఆ తరువాత కొన్ని కారణాల వలన ఆమె స్థానంలో అక్షర హాసన్ ని తీసుకున్నామని చెప్పారు. అసలు సినిమాలో మీరా మిథున్ ని హీరోయిన్ గా అనుకోలేదని.. ఆమె మీడియా ముందుకు వచ్చి తప్పుడు ఆరోపణలు చేస్తుందని అన్నారు. 

నిజానికి తను ఈ విషయంపై స్పందించాలని అనుకోలేదని.. ఆమె చేస్తున్న రాద్ధాంతం వలన స్పందించాల్సి వస్తోందని అన్నారు. మీరా మిథున్ కి ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో చాలా సార్లు ఆమె ఇలానే ప్రవర్తించింది. పబ్లిసిటీ కోసం ఆమె ఇలాంటి పనులు చేస్తుంటుందని కామెంట్స్ చేస్తున్నారు.