ముంబై: తనను వేధిస్తూ 30 వేల ట్వీట్లు వచ్చాయని సినీ హీరోయిన్ మీరా చోప్రా చెప్పారు. సోషల్ మీడియా అత్యంత భయంకరంగా మారిందని ఆమె అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తనను అసభ్యంగా దూషిస్తూ ట్వీట్స్ చేస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హీరో అభిమానులపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సైబర్ వేధింపులు ఆగిపోవాలని, తాను ఈ ప్రపంచంలో ఎవరి అభిమానిగా ఉండాలనేది తన ఇష్టమని మీరా చోప్రా మీడియాతో అన్నారు. తనపై అత్యాచారం చేస్తామని, ముఖంపై యాసిడ్ చల్లుతామని, హత్య చేస్తామని వాళ్లు బెదిరించారని ఆమె అన్ారు .

సోషల్ మీడియా ప్రమాదకరమైన, భయంకరమైన ప్రదేశంగా మారిందని, తనకు దాగాపు 30 వేల ట్వీట్లు వచ్చాయని, అందుకే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భావించానని మీరా చోప్రా చెప్పారు. తాను న్యాయంవైపే ఉంటానని, దాన్ని వ్యతిరేకించకపోతే తప్పు చేసినదాన్నవుతానని ఆమె అన్నారు. 

అందుకే హైదరాబాదు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారు దర్యాప్తు చేస్తున్నారని, తన ఇల్లు ఢిల్లీలో ఉంది కాబట్టి ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారని, అది కూడా చేశానని ఆమె చెప్పారు .

హీరోలు తమ ఫ్యాన్స్ క్లబ్ ల ఖాతాల గురించి తెలుసుకోవాలని, ఇలాంటి ప్రవర్తనను ఖండించాలని ఆమె అన్నారు. ఫ్యాన్స్ హీరోలను దేవుళ్లుగా భావిస్తారని, కాబట్టి దేవుళ్ల మాట కచ్చితంగా వింటారని తన అభిప్రాయమని ఆమె అన్నారు. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయని, కానీ ఫ్యాన్స్ ప్రవర్తిస్తున్న తీరు ఏ మాత్రం బాగా లేదని ఆమె అన్నారు.