సుప్రసిద్ద దర్శకుడు, తెలుగు జాతి మాత్రమే కాక యావత్ భారతదేశం గర్వించదగ్గ దిక్ దర్శకుడు కె.వి రెడ్డి గారు.  ‘మాయాబజార్’, ‘పాతాళబైరవి’ వంటి అపురూప చిత్రాలను అందించిన తెలుగు ప్రేక్షకులకు అందించిన దర్శకులు ఆయన.  కె. వి రెడ్డి గారి మరణం కూడా సినిమా సంఘటనలా జరిగింది.

ఓ రోజు వాళ్లబ్బాయి నాకు ఉద్యోగం వచ్చింది నాన్నా అన్నాడట. ఆయన చాలా ఆనందపడి భార్యను, పిల్లలను పిలిచి, దగ్గర కూర్చోబెట్టుకుని ఇంటి పెద్దగా నా బాధ్యతలు నెరవేర్చాను. ఏ క్షణంలో అయినా నేను వెళ్లిపోవచ్చు. మీరెవరూ కన్నీరు పెట్టవద్దు అంటూ భార్య వైపు చూస్తూ ముఖ్యంగా చెప్పేది నీకే అన్నారట. ఆ తర్వాత అందరూ ఆ రాత్రి భోజనం చేసి నిద్రపోయారు.

తెల్లవారు ఝామున అయిదు గంటలకు ఆయనకు గుండెపోటు వచ్చింది. మంచి నీళ్లు తెమ్మని భార్యకు సైగ చేసారు. ఆమె గబగబా తెచ్చి ఆయన తలను ఒళ్లో పెట్టుకుని మంచి నీళ్లు తాగిస్తూండగా ఆయన తుది శ్వాస విడిచారు. మరుసటి రోజు ఉదయం ఆమె మౌనంగా శవం తల దగ్గర కూర్చుని ఉంది.

భర్త చెప్పినట్లే కంటనీరు పెట్టలేదు. ఏడుస్తున్న వాళ్లను కూడా ఆమె ఓదార్చి...నాకు రాత్రే అంతా చెప్పారు. అలాగే జరిగింది. బాధపడాల్సిన పనిలేదు. నేను కూడా ఎక్కువ రోజులు బ్రతకను అన్నారు. అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న ఆమె ఆ తర్వాత ఇరవై రోజులుకే కన్ను మూసారు.

(గుమ్మడి రాసిన తీపి గురుతులు...చేదు జ్ఞాపకాలు నుంచి)

కె.వి.రెడ్డి గా సుప్రసిద్ధుడైన కదిరి వెంకట రెడ్డి (1912 - 1972) తెలుగు సినిమాలకు స్వర్ణ యుగమైన, 1940-1970 మధ్య కాలంలో ఎన్నో ఉత్తమ చిత్రాలను తెలుగు తెరకు అందించిన ప్రతిభావంతుడైన దర్శకుడు, నిర్మాత మరియు రచయిత. పురాణాలు, జానపద చలన చిత్రాలు తియ్యడంలో సాటి లేని మేటి అనిపించుకొన్నారు.