భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ బ్యానర్ లో అతి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన చిత్రం మత్తు వదలరా. నూతన దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించిన ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. కీరవాణి తనయులలో ఒకరైన శ్రీ సింహా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించాడు. మరో తనయుడు కాల భైరవ ఈ చిత్రానికి స్వరాలు అందించాడు. 

సెలెబ్రిటీ కిడ్స్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ప్రచారంలో సినీ ప్రముఖుల నుంచి మంచి సపోర్ట్ లభించింది. రాంచరణ్ చేతుల మీదుగా టీజర్ లాంచ్ ఐంది. రానా ట్రైలర్ లాంచ్ చేశాడు. ఇక ప్రీరిలీజ్ ఈవెంట్ కు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫలితంగా మత్తువదలరా చిత్రంపై మంచి బజ్ ఏర్పడింది. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ షోలు పూర్తయిన నేపథ్యంలో మత్తువదలరా చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం.. 

డబ్బు కోసం ఇబ్బంది పడుతూ డెలివరీ బాయ్ గా జీవనం సాగించే ఓ యువకుడు, అతడి స్నేహితుల కథ ఈ చిత్రం. అతడు చేసే చిన్న చిన్న నేరాల వల్ల అనుకోకుండా ఓ పెద్ద క్రైమ్ లో హీరో చిక్కుకుంటాడు. ఈ అంశాన్ని దర్శకుడు చాలా ఆసక్తికరంగా చిత్రీకరించారు. 

హీరోకు క్రమంగా ఇబ్బందులు ఎక్కువై దిక్కు తోచని స్థితిలోకి వెళ్లిపోతాడు. ఆ సన్నివేశాలు బాగా పండాయి. దీనికి తోడు కమెడియన్ సత్య హాస్య సన్నివేశాలు ఫస్ట్ హాఫ్ లో హైలైట్ గా నిలిచాయి. తన కామెడీ టైమింగ్ తో ప్రతి డైలాగ్ లో సత్య ఫన్ క్రియేట్ చేశాడు. ఫస్టాఫ్ సాగినంత ఆసక్తిగా సెకండ్ హాఫ్ ఉండదు. కామెడీ కాస్త తగ్గుతుంది. మొత్తంగా దర్శకుడు రితేష్ రానా.. కీరవాణి తనయులు శ్రీసింహా, కాల భైరవ నుంచి వచ్చిన మత్తు వదలరా చిత్రం ఓ మంచి ప్రయత్నం అని ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తోంది.