మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరాఠీ ప్లేబ్యాక్ సింగర్ గీతా మాలీ మృతి చెందారు. ఈ ప్రమాదం ముంబై-ఆగ్రా హైవేపై చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే యూఎస్ నుంచి వచ్చిన ఆమె తన స్వస్థలమైన నాసిక్‌కు కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

గురువారం తెల్లవారుజామున 3గంటలకు ఆమె ప్రయాణిస్తున్న కారు.. రోడ్డు పక్కన నిలిపివుంచిన  ఓ కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గీతతో పాటు ఆమె భర్త కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని వెంటనే షాపూర్ రూరల్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ గీత మృతి చెందింది.

ఆమె భర్త పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. యాక్సిడెంట్ జరగడానికి ముందు గీత తన సోషల్ మీడియా అకౌంట్ లో అమెరికా నుండి ఇప్పుడే లాండ్ అయ్యానంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

కాసేపటికే ఆమె మరణించడం కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచేసింది. కాగా.. గీత పలు మరాఠీ సినిమాలలో పాటల పాడారు. అలానే కొన్ని సొంత ఆల్బమ్స్ కూడా రూపొందించారు. ఆమె మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.