క్రేజీ హీరోయిన్ మనీషా కొయిరాలా పేరు చెప్పగానే ఒకే ఒక్కడు, బాంబే, భారతీయుడు లాంటి క్లాసిక్ హిట్స్ గుర్తుకు వస్తాయి. తెలుగులో మనీషా కొయిరాలా నాగార్జున సరసన క్రిమినల్ చిత్రంలో రొమాన్స్ పండించింది. మనీషా పుట్టి పెరిగింది నేపాల్ లో. కానీ ఇండియన్ చిత్రాలలో ఆమె అగ్ర నటిగా ఎదిగింది. 

తాజాగా మనీషా కొయిరాలా ఓ వివాదంలో చిక్కుకుంది. ఇటీవల నేపాల్ ప్రభుత్వం విడుదల చేసిన ఆ దేశ మ్యాప్ భారత్ తో సరిహద్దు వివాదానికి కారణం అయింది. భారత్ కు చెందిన లిపులేఖ్‌, కాలాపాని, లింపియాధురా ప్రాంతాల్నితమవిగా పేర్కొంటూ నేపాల్ ప్రభుత్వం మ్యాప్ లో పొందిపరిచారు. 

ఆ మ్యాప్ కు మనీషా మద్దతు తెలుపుతూ ట్వీట్ చేసింది. మన చిన్న దేశపు గౌరవం నిలబెడుతున్నారు. అందుకు ధన్యవాదాలు. ఇండియా, చైనా, నేపాల్ మధ్య శాంతియుతమైన చర్చల కోసం అందరం ఎదురుచూస్తున్నాం అంటూ మనీషా పేర్కొంది. 

మనీషా నేపాల్ కు మద్దతు తెలపడం నెటిజన్లకు నచ్చలేదు. దీనితో ఆమెపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. భారత్ లో ఉపాధి, ఖ్యాతి పొందితూ ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడుతావా అంటూ నెటిజన్లు మనీషాని విమర్శిస్తున్నారు. 

కేవలం నెటిజన్లు మాత్రమే కాదు కొందరు సెలెబ్రిటీలు కూడా మనీషా  తప్పుపడుతున్నారు. దివంగత నేత సుష్మాస్వరాజ్ భర్త, మిజోరాం గవర్నర్ అయిన స్వరాజ్ కౌశల్ మనీషాకు పలు ప్రశ్నలు సంధించారు. మనీషా నేపాల్ కు మద్దతు ఇవ్వడాన్ని తప్పుపడుతూ.. ఇండియా, నేపాల్ మధ్యలోకి చైనాని ఎందుకు తీసుకోవచ్చావ్ అని ప్రశ్నించారు. 

మనీషా తాత, నేపాల్ మాజీ ప్రధాని అయిన భిశ్వేశ్వర్ ప్రసాద్ తో, ఆమె తండ్రి ప్రకాష్ తో తనకు మంచి సంబంధాలు ఉన్నట్లు స్వరాజ్ తెలిపారు.