వరుసగా అపజయాలతో సతమతమవుతున్న ఒకప్పటి స్టార్ దర్శకుడు శ్రీను వైట్లకు ఇప్పుడు అవకాశాలు దొరకడమే కష్టంగా మారింది. ఫైనల్ గా ఆయన త్వరలో ఒక సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అదే తరహాలో ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్న మంచు విష్ణు శ్రీను వైట్లతో ఒక సినిమా చేయబోతున్నట్లు గతంలో ఒక క్లారిటీ అయితే వచ్చింది.

అయితే అది డీ సినిమాకు సీక్వెల్ అని తెలుస్తోంది.   2007లో వచ్చిన ఆ సినిమా విష్ణు కెరీర్ మంచి బూస్ట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా కథను కొనసాగించే విధంగా దర్శకుడు రైటర్స్ తో చర్చలు జరుపుతున్నాడు. దాదాపు స్క్రిప్ట్ రెడీ అయినట్లు తెలుస్తోంది. అలాగే సినిమాలో మరొక హీరో కూడా నటించే అవకాశం ఉన్నట్లు మొన్నటివరకు ఒక టాక్ అయితే వచ్చింది. కానీ అది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

మంచు విష్ణు కూడా సక్సెస్ చూసి చాలా కాలమవుతోంది. ఇక ఈ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకునే హీరోయిన్ ఎవరు? అనే ప్రశ్నకు త్వరలోనే చిత్ర యూనిట్ సమాధానం ఇవ్వనుంది. ప్రస్తుతం మంచు విష్ణు మోసగాళ్లు అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ వేసవిలో చిత్రాన్ని విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీసాఫీసర్ గా సునీల్ శెట్టి నటిస్తున్నాడు.