వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ నటుడిగా కొనసాగుతూ సినిమాలతో మిమ్మల్ని అలరిస్తానని ఫ్యాన్స్ కు మనోజ్ భరోసా ఇచ్చాడు. అందుకు తగ్గట్లుగానే మనోజ్ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. దీపావళి సందర్భంగా ఆశ్చర్యకర ప్రకటన చేశాడు. నిర్మాతగా అవతారం ఎత్తాడు. 

'దీపావళి రోజున సొంతంగా నిర్మాణ సంస్థని ప్రారంభిస్తున్నా. దానిపేరు 'ఎంఎం ఆర్ట్స్'. ఈ సరికొత్త ప్రయాణానికి మీ అందరి ఆశీర్వదం కావాలి అని మంచు మనోజ్ ట్వీట్ చేశాడు. 

సరికొత్త ప్రయాణం ప్రారంభమైంది. నా కొత్త నిర్మాణ సంస్థ ఎంఎం ఆర్ట్స్ ఈ రోజే జన్మించింది. నా తదుపరి చిత్రాలు ఈ బ్యానర్ లోనే ఉండబోతున్నాయి. ప్రస్తుతం  ఆయా చిత్రాలకు సంబంధించిన వర్క్ జరుగుతోంది. నా నిర్మాణ సంస్థ ద్వారా చిత్ర పరిశ్రమలోకి కొత్త ట్యాలెంట్ ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నా. ఎంఎం ఆర్ట్స్ నుంచి గొప్ప చిత్రాలు అందించే ప్రయత్నం చేస్తా. అందరికి దీపావళి శుభాకాంక్షలు అని మంచు మనోజ్ పేర్కొన్నాడు. 

ఈ మేరకు తన ప్రొడక్షన్ హౌస్ లోగోని కూడా మనోజ్ విడుదల చేశాడు. మంచు మనోజ్, ప్రణతి లు 2015లో వివాహం చేసుకున్నారు. గత రెండేళ్లుగా విభేదాలతో ఈ జంట దూరంగా ఉంటోంది. మనోజ్ వైవాహిక జీవితం గురించి అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. వీటన్నిటికీ క్లారిటీ ఇస్తూ మనోజ్ సోషల్ మీడియాలో ప్రకటన చేశాడు. తాను, ప్రణతి విడాకులు తీసుకుని విడిపోయినట్లు మనోజ్ తెలిపాడు. 

ఈ కఠిన నిర్ణయం తర్వాత మనోజ్ తిరిగి సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. కొత్తగా ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించడం కూడా అందులో భాగమే.