మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన చేసిన సినిమా డబ్బింగ్ లు రిలీజ్ అవటమే కాకుండా ..స్వాతి కిరణం, యాత్ర లాంటి డైరెక్ట్ తెలుగు సినిమాల్లో కూడా ఆయన నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందారు. తాజాగా మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పీరియడ్‌ డ్రామా‘మామాంగం’. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని తెలుగులో గీతా ఆర్ట్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం తెలుగు వెర్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది..గీతా ఆర్ట్స్ రిలీజ్ కావటంతో వైరల్ అవుతోంది. ఇందులో మమ్ముట్టి కేరళ సాంప్రదాయ యుద్ధవీరుడిగా కనిపించాడు. మమాంగం అనే పండుగ సందర్భంగా జరిగే వివాదం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది.

 ‘‘మామాంగానికి వల్లువనాడు నుంచి ఇప్పటికీ ఒక్క వ్యక్తైనా వస్తున్నాడంటే.. ఆ ప్రతీకార జ్వాలలు ఇంకా మన వల్లువనాడు స్త్రీల మనసులో రగులుతూనే ఉన్నాయి కాబట్టి.. అటువంటి వారి కడుపునే నువ్వు, నేను జన్మించాం’ అని మమ్ముట్టి వివరిస్తున్న డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభమైంది. అలాగే ‘విజయం కోసం తెగించి వెళ్లిన ఏ మగవాడ్ని తలచుకుని.. వల్లువనాడులో ఏ ఆడది ఒక్క బొట్టు కూడా కన్నీరు కార్చదు. అలా జరిగితే అది ప్రళయం అవుతుంది’ అని మరొకరు చెబుతున్నారు. ‘రావణుడిలాంటి అతడ్ని ఎదుర్కోవాలంటే ఒక మహాపురుషుడే అవతారం ఎత్తి ఉండాలి’ అని చెప్పడం సినిమాపై ఇంట్రస్ట్ ని పెంచింది. ‘చావుకి సిద్ధంగా ఉండు’ అని చిన్న బాలుడు సైతం ఛాలెంజ్ చేయడం ఆకట్టుకుంటోంది.

1680 కాలానికి చెందిన ఓ మహావీరుడి కథాంశంతో దర్శకుడు పద్మ కుమార్‌ ఈ సినిమాను తీస్తున్నారు. రాజా జామో అనే రాజు అరాచకాలకు వ్యతిరేకంగా సావేర్స్‌ అనే ఓ కొందరు టీమ్ గా ఏర్పడి చేసిన పోరాటమే ఈ చిత్రం. మమ్ముట్టితో పాటు ఉన్ని ముకుందన్‌, సిద్ధిక్‌, మణికుట్టన్‌, కనిక, అను నటిస్తున్నారు. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ త్వరలో ఈ సినిమా విడుదల కాబోతోంది.

మమ్ముట్టి మాట్లాడుతూ ‘‘భారతదేశ సంస్కృతి విశిష్టమైనది. దేశ ప్రజల్ని భాషలు విభజించినా... భాష వల్ల ఒకరి చరిత్ర మరొకరికి తెలియకుండా పోకూడదు. కేరళ చరిత్ర అంటే దేశ చరిత్ర కూడా. సినిమా ద్వారా అన్ని భాషల ప్రేక్షకుల్ని ఏకం చేసి, మనకు సంబంధించిన కథ చెప్పే ప్రయత్నం చేస్తున్నా’’ అన్నారు.

ఈ మూవీ తొలి షెడ్యూల్‌ సంజీవ్‌ పిళ్ళై దర్శకత్వం వహించగా తరువాతి షెడ్యూల్‌ నుంచి ఎం పద్మకుమార్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ప్రాచీ తెహ్లన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో, ఉన్ని ముకుందన్‌, మోహన్‌ శర్మ, ప్రాచీ దేశాయ్‌, మాళవికా మీనన్‌ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మాటలు: కిరణ్‌, సంగీతం: ఎం. జయచంద్రన్‌, నేపథ్య సంగీతం: సంచిత్‌ బల్హారా, అంకిత్‌ బల్హారా.