గత ఎన్నికలకు ముందుకు వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా యాత్ర పేరుతో సినిమా రిలీజ్‌ అయ్యింది. మహీ రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వైఎస్‌ఆర్‌ పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి కనిపించి మెప్పించాడు. ఒక రకంగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అఖండ విజయం వెనుక ఈ సినిమా ప్రభావం కూడా అంతో ఇంతో ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే యాత్ర సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచే యాత్ర 2పై చర్చ మొదలైంది.

వైఎస్‌ జగన్ చేసిన సుధీర్ఘ పాత్ర యాత్ర, కాంగ్రెస్ పార్టీ కారణంగా మొదలైన వైఎస్ జగన్‌కు ఎదురైన సమస్యలో ఆయన జీవితంలోని మలుపులు, కష్టాలు చివరకు సీఎం ప్రమాణ స్వీకారం చేయటం లాంటి అంశాలతో ఈ సినిమాను రూపొందిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్‌ మీదకు వెళుతుందా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.

అయితే ఈ విషయంపై దర్శకుడు మహి వీ రాఘవ క్లారిటీ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ `వైఎస్‌ కథను సినిమాగా చేయాలంటే కష్టపడాలి కానీ, జగన్‌ కథకు అవసరం లేదు. ఆయన జీవితంలో కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయి. హీరోయిజం, కష్టాలు, పోరాటం లాంటి అంశాలతో గాడ్‌ ఫాదర్‌ను తలపించే మలుపులు ఆయన కథలో ఎన్నో ఉన్నాయి. అందుకే ఆయన సినిమా కథ కోసం ఎక్కువ పని చేయాల్సిన అవసరం లేద`న్నాడు.

అయితే ఈ బయోపిక్‌ను పట్టాలెక్కించడానికి జగన్‌ అన్న ఓకె చెపితే చాలు.. 2022లో గానీ లేదా 2023లో గాని ఈ సినిమా పట్టాలెక్కుతుందని చెప్పాడు. అంటే గత ఎన్నికల ముందుకు యాత్ర సినిమా రాగా, మళ్లీ ఎన్నికల సమయానికి జగన్‌ బయోపిక్‌ తెర మీదకు వచ్చే అవకాశం ఉందన్న మాట. లాక్‌ డౌన్‌ కారణంగా ఇంట్లో ఉన్న మహి వీ రాఘవ.. వంట చేస్తూ టైం పాస్‌ చేస్తున్నా అని తెలిపాడు.