వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోయే సినిమాలు మొదట వరుసగా డేట్లు అనౌన్స్ చేశాయి. మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' సినిమాలు ఒకేసారి థియేటర్ లోకి రానున్నాయని చెప్పడంతో డిస్ట్రిబ్యూటర్లలో కలవరం మొదలైంది.

ఒకేరోజు రెండు పెద్ద సినిమాలు వస్తున్నాయంటే.. థియేటర్లు, ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. దీంతో ఈ విషయంలో ఎవరు రాజీ పడతారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. తాజా పరిణామాలతో సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. థియేటర్లు లాక్ అయ్యాయి. 

సీతమ్మ వాకిట్లో అసురన్ స్పూఫ్.. పిచ్చ కామెడీ

ముందుగా రజినీకాంత్ 'దర్బార్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మురుగదాస్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాని మొదటి జనవరి 10 లేదా 11న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు సినిమాని జనవరి 9న రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అలానే మహేష్ బాబు, బన్నీల మధ్య కూడా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.

నిజానికి ఈ రెండు సినిమాలు ఒకేసారి రావాలనుకున్నప్పుడు సంక్రాంతికి మంచి ఫైట్ ఉంటుందని భావించారు. కానీ పలు విషయాలను ఆలోచనలో పెట్టుకొని ఈ ఇద్దరి హీరోల మధ్య రాజీ కుదిర్చినట్లు తెలుస్తోంది. నిజానికి మహేష్ బాబు చాలా పంతంగా ఉండడంతో ఆయన ఈ విషయంలో వెనుకడుగు వేయరని అనుకున్నారు. కానీ ప్రొడ్యూసర్స్ గిల్డ్ జోక్యం చేసుకుని రెండు సినిమాల నిర్మాతల మధ్య రాజీ కుదిర్చిందని తెలుస్తోంది.

నిర్మాతలు అనీల్ సుంకర, చినబాబుతో మాట్లాడి సర్దిచెప్పింది. ఇద్దరూ రాజీకి రావడంతో విడుదల తేదీల విషయంలో సందిగ్ధత తొలగిపోయింది. మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' జనవరి 11న, అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మొత్తానికి ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో రాజీ పడినట్లు తెలుస్తోంది.