సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక హీరోయిన్ గా కనిపించనుంది. అయితే ఈ సినిమాకి మహేష్ బాబు తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 'భరత్ అనే నేను', 'మహర్షి' వంటి హిట్ సినిమాల తరువాత మహేష్ నటిస్తోన్న సినిమా 
కావడంతో రెమ్యునరేషన్ పెంచే అవకాశాలు ఉన్నాయని అనుకున్నారు. 

ఈ సినిమా కోసం మహేష్ యాభై కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని వార్తలు వినిపించాయి. అయితే అందులో నిజం లేదని చిత్రనిర్మాతల్లో ఒకరైన అనీల్ సుంకర వెల్లడించారు. సినిమాలో మహేష్ కి కూడా వాటా ఉండడంతో ఇప్పటివరకు ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు. సినిమా హిట్ అయితే భారీ వాటాను రెమ్యునరేషన్ గా తీసుకుంటారని చెప్పారు.

ఈ సినిమాకి అనీల్ సుంకరతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో దిల్ రాజుకి, అనీల్ సుంకరకి మధ్య కూడా విభేదాలు వచ్చాయని వదంతులు వినిపించాయి. దీనిపై కూడా అనీల్ సుంకర క్లారిటీ ఇచ్చారు. దిల్ రాజు తనతో చాలా సన్నిహితంగా ఉంటారని.. సినిమా ప్రొడక్షన్ లో ఆయన భాగం తీసుకోవడం తనకు సంతోషాన్నిస్తుందని చెప్పారు.

ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ గా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా పోస్టర్ ని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.