ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన మహేష్ ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేసినట్టుగా తెలుస్తోంది. దీంతో మహేష్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. చాలా కాలంగా చర్చల్లో ఉన్న పరశురామ్ ప్రాజెక్ట్ ను తెర మీదకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు గా ప్రచారం జరుగుతోంది. అయితే ఇంత వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

అయితే తాజాగా మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం వరుసగా కథలు వింటున్న మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో  ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన పోకిరి, బిజినెస్‌మేన్‌ సినిమాలు సూపర్‌ హిట్ కావటంతో ఈ కాంబినేషన్‌లో మరో ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో రెండు మూడు సార్లు వీరి కాంబినేషన్‌ విషయంలో వార్తలు వచ్చినా ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు రాలేదు.

అయితే మహేష్ కోసం జనగణమన అనే కథ రెడీ చేసిన పూరి, సినిమాను స్టార్ట్‌ చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ మహేష్ ఎటూ తేల్చకపోవటంతో పూరి బహిరంగంగానే విమర్శించాడు. మిర ఇప్పుడు మహేష్, పూరితో కలిసి పనిచేసేందుకు అంగీకరిస్తాడా అన్న చర్చ జరుగుతోంది. ఇటీవల ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాతో సూపర్‌ హిట్ కొట్టిన పూరి ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ హీరోగా ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత మహేష్‌ బాబుతో సినిమా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.