2013లో వచ్చిన ఫ్రోజెన్‌ సినిమా వరల్డ్ వైడ్ గా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో విజయాన్ని అందుకోవాలని ఫ్రోజెన్ 2 రాబోతోంది. ఇటివల కాలంలో హాలీవుడ్ సినిమాలు చాలా వరకు తెలుగులో అనువాదమవుతున్న విషయం తెలిసిందే. అలాగే మన తారలు ఆ సినిమాల్లోని పాత్రలకు వాయిస్ ఓవర్ ఇస్తుండడంతో సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతోంది.

 

ఇక ఇప్పుడు ఫ్రోజెన్ 2కి కూడా మహేష్ కూతురు అలాగే నిత్యా మీనన్ తెలుగులో డబ్బింగ్ చెబుతుండడంతో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. చిన్న క్వీన్ ఎల్సా పాత్రకు సితార డబ్బింగ్ చెప్పడంతో కూతురు పనితనానికి తండ్రి మహేష్ సంబరపడిపోతున్నారు. ఎల్సా చిన్నప్పటి పాత్రలో సితారా జీవించింది అంటూ నమ్మకంగా సంగీతపరంగా ఉండే ఆ పాత్రకు సితారా ఇచ్చిన వాయిస్ అద్భుతంగా ఉందని చెప్పారు. అలాగే సితార పాపను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని నవంబర్ 22కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు మహేష్ ట్వీట్ చేశారు. 

ఇటీవల దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టింది సితార. ఇందులో చిన్న చిన్న వీడియోలు పెడుతూ ఎంటర్టైన్ చేస్తుంది. ఇప్పుడు సరికొత్తగా హాలీవుడ్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తూ తన కొత్త టాలెంట్ ని బయటపెట్టింది. మరి సినిమాతో ఎంతవరకు క్రేజ్ అందుకుంటుందో చూడాలి. మరోవైపు యువరాణి ఎల్సా పాత్రకు  ప్రముఖ నటి నిత్యామీనాన్‌ డబ్బింగ్‌ చెప్పిన విషయం తెలిసిందే.