ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా సినీరంగ ప్రవేశానికి రంగం సిద్ధం అయింది. ఆదివారం రోజు అశోక్ గల్లా హీరోగా నటించబోతున్న చిత్రం ప్రారంభం కాబోతోంది. మహేష్ బాబు మేనల్లుడు హీరోగా ఎంట్రీ ఇస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. హీరో కాకముందే గల్లా అశోక్ లుక్స్ పరంగా ఆకట్టుకున్నాడు. ఇక నటనలో మెప్పించాల్సి ఉంది. 

శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్ర లాంచింగ్ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రాంచరణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడు. గల్లా జయదేవ్ రాంచరణ్ ని గెస్ట్ గా ఇన్వైట్ చేసినట్లు తెలుస్తోంది. గల్లా అశోక్ సరసన ఈ చిత్రంలో అందాల తార నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. 

సినీ ప్రముఖుల మధ్య ఈ చిత్ర లాంచింగ్ కార్యక్రమం జరగనుంది. ఇక తన మేనల్లుడి సినిమా లాంచింగ్ కావడంతో కొద్దిసేపటి క్రితమే మహేష్ ట్విట్టర్ లో స్పందించాడు. తన మేనల్లుడికి, చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపాడు. అశోక్ గల్లా తొలి చిత్రం అధికారికంగా నేడే ప్రారంభం కాబోతోంది. ఇది నీ జీవితంలో బిగ్ డే. అంతా మంచే జరగాలని శుభాకాంక్షలు తెలుపుతున్నా. 

బాగా కష్టపడు.. నీ శక్తి మేరకు ప్రయత్నించు.. విజయం నీ వెనకాల వస్తుంది.. చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్.. అని మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా తన మేనల్లుడికి సూచనలు చేశాడు. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ, గల్లా అరుణ కుమారి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. 

జిబ్రాన్ సంగీత దర్శకుడు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.