ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా సాధారణ ప్రజానీకతంతో పాటు సెలబ్రిటీలకు కూడా చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా సీనియర్‌ నటులు, సాంకేతిక నిపుణులు విషయంలో కొంత మంది భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖగాయని లతా మంగేష్కర్ స్పందించారు. కరోనా వైరస్‌ మృత్యుఘంటికలు మోగిస్తున్న తరుణంలో తాను ఇంట్లోని వ్యక్తులతో కూడా మాట్లాడటం లేదని ఆమె తెలిపారు.

దీనికి తోడు ఇటీవల ఆమె తీవ్రం అనారోగ్యానికి గురికావటం కూడా కుటుంబ సభ్యులకు ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల లతాజీ తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో అభిమానులు ఆమె ఆరోగ్యపరిస్తితి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అభిమానుల ప్రార్థనలతో ఆమె ఆరోగ్యంగా తిరిగి ఇంటి వచ్చారు. 

తాజాగా కరోనా అవుట్‌ బ్రేక్‌ తరువాత జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో వెల్లడించారు. `నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నా. కనీసం ఫ్యామిలీ మెంబర్స్‌ తో కూడా మాట్లాడటం లేదు. దూరం నుంచే పరామర్శిస్తున్నా. నాకు సహాయం అందిస్తున్న ఇద్దరు వ్యక్తిగత వైధ్యులు, నర్సులు సూచించిన జాగ్రత్తలను తూచా తప్పకుండా పాటిస్తున్నా` అని చెప్పారు.