Asianet News TeluguAsianet News Telugu

ఎనిమిదేళ్ల వయసులో మా నాన్న నాపై లైంగిక వేధింపులు: ఖుష్బూ

 కన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడడాన్ని జన్మహక్కుగా భావించే వ్యక్తి వల్ల ...

Kushboo Sundar says her father sexually abused her when she was 8 jsp
Author
First Published Aug 28, 2024, 1:23 PM IST | Last Updated Aug 28, 2024, 1:23 PM IST


ఎనిమిదేళ్ల వయసులో సొంత తండ్రి తనను లైంగికంగా వేధించారని, ఆ వయసులో ఆయనను ఎదిరించే ధైర్యం లేక కుమిలిపోయానని  సినీ నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బు గతంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి హేమ కమిటీ రిపోర్ట్‌ (Hema Committee Report)ను ఉద్దేశించి ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఖుష్బూ.  ప్రతి పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయంటూ తాజాగా ఆమె ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టారు.

ఖుష్బూ ఈ విషయంపై తన స్పందన తెలియచేస్తూ... ‘‘తన భార్యాపిల్లల్ని చిత్రహింసలు పెట్టడం, కన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడడాన్ని జన్మహక్కుగా భావించే వ్యక్తి వల్ల నా తల్లి వైవాహిక బంధంలో ఇబ్బందులు పడింది. ఎనిమిదేళ్ల వయసులోనే నేను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా. 

ఈ విషయాన్ని చెబితే మా అమ్మ నమ్ముతుందో లేదోనని ఎంతో భయపడ్డాను. ఎందుకంటే.. ఏం జరిగినా తన భర్త దేవుడని నమ్మే మనస్తత్వం ఆమెది. 15 ఏళ్ల వయసులో ఆయనకు ఎదురుతిరగడం మొదలుపెట్టాను. నాకు 16 ఏళ్లు రాకముందే ఆయన మమ్మల్ని వదిలివెళ్లి పోయాడు. ఆ సమయంలో మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం’’ అని గతంలో ఖుష్బూ తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి తెలియజేశారు.

 ఆ ట్వీట్ లో ఏముందంటే...  ‘‘మన చిత్ర పరిశ్రమలో మహిళలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం బాధాకరం. వీటిపై ధైర్యంగా ముందుకు వచ్చిన మహిళలను మెచ్చుకోవాలి. వేధింపులను బయట పెట్టడానికి హేమ కమిటీ రిపోర్ట్‌ ఎంతో ఉపయోగపడింది. కెరీర్‌లో రాణించాలనుకుంటే వేధింపులు లేదా కమిట్‌మెంట్‌ ఇవ్వాలని  కోరడం లాంటి పరిస్థితులు మహిళలకు అన్ని రంగాల్లోనూ ఎదురవుతున్నాయి. పురుషులకూ ఇలాంటి పరిస్థితులు ఉండొచ్చు. 

కానీ ఎక్కువగా వేధింపులు ఎదుర్కొనేది  స్త్రీలే. ఈ విషయంపై నా కుమార్తెలతోనూ సవివరంగా చర్చించాను. మీరు ఎప్పుడు మాట్లాడారనేది విషయం కాదు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా వచ్చి చెప్పాలి. ఘటన జరిగిన వెంటనే మాట్లాడితే దర్యాప్తునకు సహాయ పడుతుంది. 

బాధితులకు మన సపోర్ట్‌ ఎంతో అవసరం. వారి బాధను మనం వినాలి. మానసికంగా వారికి ధైర్యం చెప్పాలి. సమస్య  ఎదురైనప్పుడే వారెందుకు మాట్లాడలేదని చాలామంది ప్రశ్నిస్తున్నారు. బయటకు వచ్చి చెప్పే ధైర్యం అందరికీ ఉండదు కదా. తండ్రి వేధింపుల గురించి బయటకు వచ్చి మాట్లాడటానికి ఎందుకు అంత సమయం తీసుకున్నావు? అని చాలామంది గతంలో నన్ను అడిగారు. నిజమే.. నేను ముందే మాట్లాడాల్సింది. 

ఆ ఘటన కెరీర్‌ విషయంలో జరిగింది కాదు. నన్ను రక్షించాల్సిన వ్యక్తి నుంచే నేను వేధింపులు ఎదుర్కొన్నా. చాలామంది మహిళలకు కుటుంబం నుంచి సరైన మద్దతు లేదనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. చిన్న గ్రామాలకు చెందిన ఎంతోమంది అమ్మాయిలు ఎన్నో ఆశలతో ఇక్కడికి వస్తారు. వారి ఆశలను ఆదిలోనే తుంచేస్తున్నారు. 

పురుషులందరికీ నేను చెప్పేది ఒక్కటే.. బాధిత మహిళలకు అండగా నిలవండి. మహిళలపై జరుగుతున్న ఈ సంఘటనలపై మీరు కూడా స్పందించాలి. మీ ప్రేమ, మద్దతును వారికి అందజేయండి. గుర్తుంచుకోండి, అందరూ కలిసి ఈ గాయాలు మానేలా చేయగలం. ఈ నివేదిక మనందరిలో మార్పు తీసుకురావాలి’’ అని ఖుష్బూ తెలిపారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios