టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కూడా గుడ్ బై చెప్పేశాడు. ఇప్పటివరకు కొరటాల, దేవిశ్రీప్రసాద్ కలిసి నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాలకు పని చేశారు. అన్నీ కూడా మ్యూజికల్ గా హిట్స్ అందుకున్నాయి.

కానీ మొదటిసారి కొరటాల శివ ఓ హిందీ మ్యూజిక్ డైరెక్టర్ తో కలిసి పని చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు కొరటాల, చిరు కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా లాంఛనంగా మొదలైంది. ఈ సినిమాకి సంబంధించిన వివరాలలో మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఎక్కడా లేదు. దానికి కారణం.. కొరటాల మరో మ్యూజిక్ డైరెక్టర్ పని చేయాలని అనుకోవడమే అని తెలుస్తోంది.

కొరటాలతో పాటు మెగాస్టార్, రామ్ చరణ్ ల నిర్ణయం కూడా అదే అయి ఉంటుందనే సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే మెగాస్టార్, రామ్ చరణ్ కి నచ్చితే కొరటాల కాదనే అవకాశం లేదు. 'ఖైదీ నెం 150' సినిమా సక్సెస్ లో దేవిశ్రీప్రసాద్ పాత్ర చాలా కీలకం కానీ 'సైరా' సినిమాకి మాత్రం అతడిని తీసుకోలేదు.

పోనీ అది ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి తీసుకోలేదని సరిపెట్టుకుంటే ఇప్పుడు రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి కూడా దేవిని తీసుకోవడం లేదంటే అతడిని దూరం పెడుతున్నారనే అనుకోవాలి. నిజానికి రామ్ చరణ్ 'రంగస్థలం' సినిమాకి కూడా దేవి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. కానీ అతడిని రిపీట్ చేయడం లేదంటే టాలీవుడ్ లో అతడి క్రేజ్ తగ్గుతుందనే చెప్పాలి.