'కినిమా'   సెప్టెంబర్ 1952 సంచికలో కొడవగంటి కుటుంబరావు గారు 'ఎన్టీఆర్'  ని  పర్సనల్‌గా ఇంటర్‌వ్యూ చేసి రాసిన వ్యాసం ఇప్పుడు చదవటానికి ఆసక్తికరమే. దాన్ని యధాతథంగా అందిస్తున్నాం..

జూన్ లో పుట్టిన వారి లక్షణాలన్ని...

'పాతాళభైరవి' నాయకుడు తోటరాముడుగా యావదాంధ్రకే గాక, యావధ్భారతానికీ, అంతర్జాతీయ సినిమా ఉత్సవాల ద్వారా విదేశీయ సినిమా ప్రతినిధి వర్గాలకూ పరిచయం అయిన నందమూరి తారక రామారావు (మీ ఎన్.టి. రామారావు) 1923 జూన్ 15 న గుడివాడ తాలూకా నిమ్మకూరు గ్రామంలో పుట్టాడు.

జూన్ లో పుట్టిన వారు తెలివైన నటులూ, లాయర్లూ, ఉపన్యాసకులూ, జీవిత నాటకంలో మారుతూ ఉండే పాత్రలు ధరించే వారు అవుతారు అని చెప్తారు. వీరిని అర్దం చేసుకోవటం చాలా కష్టం. వీరి మనసులు అతి చురుకుగా ఉండి, శత్రువులకు అందుకోరానివిగా ఉంటాయి.  ఈ నెలలో పుట్టినవారికి పైకి రావాలనే ఆశ ఉంటుంది కానీ ఒక స్దాయికి చేరుకునేలోగానే దాని మీద విరక్తి కలుగుతుంది. వీరి ముఖాలు కోలగా ఉంటాయి. కళ్ళు అందంగా, చురుకుగా ఉంటాయి. వీరికి మిత్రులు ఎక్కువగా ఉంటారు. తత్కాలానికి తమ మనుసులో మెసిలే మనిషికి వీరు విరివిగా సహాయం చేస్తారు. వీరి వేగం ఇష్టం. ఈ లక్షణాలలో చాలా భాగం రామారావులో మనం చూడవచ్చు.

షోకు రామయ్యగారు..

రామారావు తండ్రి లక్ష్మయ్యగారు తల్లి వెంకట రామమ్మగారు. వారిది రైతు వంశం. నిమ్మకూరులో వారి కుటుంబానికి రెండు పెద్ద లోగిళ్లూ, సుమారైన భూవసతి ఉంది. ఈ నందమూరి వారిలో ఆడపిల్లలు అరుదుగా కనిపిస్తారు. రామారావుకు మేనత్తలుగాని, అక్క చెల్లెళ్లు  గానీ, కుమార్తెలు కానీ లేరు. అతనికి రామకృష్ణ, జయకృష్ణ అని ఇద్దరు కుమారులు ఉన్నారు.

రామారావు తండ్రి గారి వద్ద పెరగలేదు. పెత్తండ్రి రామయ్యగారు అతన్ని పెంచి పెద్ద చేశారు. రామయ్యగారు విలాస పురుషుడు. దర్జాగా బతికేవాడు. తెల్లబట్ట మాయటానికి వీళ్లేదు. షోకు రామయ్య గారంటే ఆ ప్రాంతాల అందరికీ తెలుసు. ఆయనే రామారావుని పెంచి, పెద్ద చేసి చదువు చెప్పించారు.

తోటరాముడు..బండ అవతారం

రామారావు చదువు నిమిత్తం పదోయేట స్వగ్రామం వదిలిపెట్టి బెజవాడ చేరాడు.  ఈ విధ్యార్ది దశలో రామారావుని చూసినట్లు అయితే మనకు పాతాళభైరవిలోని తోట రాముడు తప్పక స్ఫురిస్తాడు. ఖాకీ లాగూ, చొక్కా ధరించి పాత హెర్య్కులిస్ సైకిల్ మీద సవారి చేసేవాడు. గోదాలో పడి బస్కీలు తీసేవాడు. శరీరం మీద తప్ప మరి దేనిమీదా ధ్యాస లేదు. ఎవరితోనో ఒకరితో పోట్లాడని రోజు దుర్దినం. అది తన పోట్లాటే కానక్కర్లేదు.

కానీ ఈ బండ అవతారం వెనుక యేదో కళాతృష్ణ దాగి ఉంది. అతనికి బొమ్మలు వెయ్యాలనే వెర్రి మహా ఉండేది. బొమ్మలు బాగా వేసేవాడు కూడాను. 1941-42 లో బెజవాడలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర విధ్యార్ది వైజ్ఞానిక మహా సభలలో రైతు బంధన అనేన ఇండియన్ ఇంక్ చిత్రానికి ప్రథమ బహుమతి వచ్చింది. ఈ చిత్రంలో ఒక ప్రక్క బంధించిన రైతు ఉంటాడు. అతడికి ఎదురుగా పెద్ద బొర్ర వేసుకుని , ఇకిలిస్తూ జమీందారు ఉంటాడు. రైతు పరికరాలు నేైలపై చెల్లాచెదరుగా  పడి ఉంటాయి.  ఈ చిత్రం రచించింది రామారావు. రామారావు హస్త నైపుణ్యం సాటి విధ్యార్దులు లెరుగుదురు. వారు తమ నోటు  పుస్తకాల మీద అతనిచేత పేర్లు రాయించుకుంటూ ఉండేవారు.

విశ్వనాథవారి అక్షింతలు పడ్డాకే...

ఎన్ని ఇతర గొడవలు ఉన్నప్పటికీ రామారావుకు నాటకాల గొడవ మటుకు లేదు. షోకు రామయ్యగారు స్టేజి మీద వేషాలు వేసేవాడు. ఆయన  నుంచి అయినా రామారావుకు నాటకాల పిచ్చి అబ్బింది కాదు. కానీ రామారావు ఇంటర్ చదువుతూ ఉండగా నాటకంలో వేషం కట్టవలిసిన పరిస్దితి ఏర్పడింది. దీనికి కారకులు మరెవరో కాదు, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు.

విశ్వనాథవారు తమ కాలేజి పిల్లల చేత ఆడించటానికికని రాచమల్లుని దౌత్యం అనే నాటిక రాసారు. అందులో నాగమ్మ(నాయకురాలు) పాత్రను రామారావు వెయ్యాలని పట్టుపట్టారు. మొదట రామారావు నిరాకరించాడు. కానీ కవిసామ్రాట్ గారి అక్షింతలు కొన్ని పడ్డాక ఒప్పుకున్నాడు.

మిగతాది రెండవ పార్ట్ లో