నవంబర్ 3న ముగిసిన బిగ్ బాస్ 3 గ్రాండ్ ఫినాలే తెలుగు ప్రేక్షకులని అలరించింది. సినీ ప్రముఖులు అతిథులుగా ఫినాలే మొత్తం కలర్ ఫుల్ గా సాగింది. ఐదుగురు ఇంటి సభ్యుల మధ్య పోటీ, నాగార్జున హోస్టింగ్, చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి, తారల ఆటపాటలు ఇలా ప్రతి అంశంలో బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలే వినోదాన్ని పంచింది. 

ఫినాలేని నిర్వాహకులు చాలా చక్కగా ప్లాన్ చేశారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు ఫినాలే సాగింది. అలీ రెజా, వరుణ్, బాబా భాస్కర్ ఎలిమినేట్ అయిన తర్వాత ఫైనల్ రేసులో శ్రీముఖి, రాహుల్ నిలిచారు. కానీ రాహుల్ అత్యధిక ఓట్లతో విజేతగా నిలిచాడు. శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది. 

ఇంత గ్రాండ్ గా సాగిన షోకు టిఆర్పి రేటింగ్స్ కూడా భారీ స్థాయిలో ఉంటాయని అంచనాలు వేశారు. అంచనాకు తగ్గట్లుగానే బిగ్ బాస్ సీజన్ 3 చరిత్ర సృష్టించింది. ఇండియాలో జరుగుతున్న బిగ్ బాస్ ఫైనల్స్ అన్నిటికంటే తెలుగు బిగ్ బాస్ సీజన్ 3కి అత్యధిక టిఆర్పి రేటింగ్స్ నమోదయ్యాయి. బిగ్ బాస్ 3 ఫైనల్ కు 18.29 రికార్డ్ టిఆర్పి నమోదైనట్లు స్టార్ మా యాజమాన్యం ప్రకటించింది. 

మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇచ్చిన చివరి గంటలో బిగ్ బాస్ షోకు ఎవరూ ఊహించని విధంగా 24.4 టిఆర్పి రేటింగ్ నమోదైంది. దీనితో బిగ్ బాస్ సీజన్ 3 ఎంతగా గ్రాండ్ సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు. 

మెగాస్టార్ చిరంజీవి అతిథిగా విచ్చేసి విజేత రాహుల్ కు ట్రోఫీ అందించారు. హీరో శ్రీకాంత్, డైరెక్టర్ మారుతి, నిధి అగర్వాల్, రాశి ఖన్నా, కేథరిన్ , అంజలి లాంటి తారలు ఫైనల్ ఎపిసోడ్ లో తళుక్కున మెరిశారు. 

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 1 ఫైనల్ కు 14.13 టిఆర్పి రేటింగ్ నమోదు కాగా నాని హోస్ట్ గా వ్యవహరించిన సీజన్ 2కి 15. 05 రేటింగ్ నమోదైంది.