చేసినివి  తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్ లో ఓ రేంజిలో క్రేజ్ తెచ్చుకున్న స్టన్నింగ్ బ్యూటీ కైరా అద్వాని. మ‌హేష్ తో చేసిన  ''భరత్ అనే నేను'' , రామ్ చరణ్ తో చేసిన వినయ విధేయ రామ సినిమాలో నటించిన కైరా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది. ఆమెని మళ్లీ తెలుగుకు తీసుకురావాలని పెద్ద నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు. స్టార్ హీరోలు ఆమె సరసన చేయాలని ఉబలాటపడుతున్నారు. అయితే ఆమెకు తెలుగుపై పెద్దగా ఇంట్రస్ట్ లేకో బాలీవుడ్ ని వదలాలని లేకో కానీ భారీ రెమ్యునేషన్ చెప్తూ భయపెడుతోందిట.

తెలుగులో రష్మిక మదన్నా వంటి స్టార్ హీరోయిన్ సైతం కోటిన్నర దగ్గర ఆగి, అదే పెద్ద రెమ్యునేషన్ గా ఫీలవుతోంది. కానీ కైరా మాత్రం ఐదు కోట్లు దాకా డిమాండ్ చేస్తోందిట. ఏమంటే తనకు హిందీలోనూ మార్కెట్ ఉందని, తను నటించిన సినిమా హిందీలోకి డబ్ చేస్తారు కాబట్టి,అక్కడా వర్కవుట్ అవుతుందని అంటోంది. దానికి తగినట్లే కైరాను తీసుకుంటే హిందీ శాటిలైట్ మార్కెట్ ని లెక్కేసుకుంటున్నారు. అది ఒక్కసారిగా రెట్టింపు అవుతుంది కాబట్టి ఆమెను తీసుకుంటే కలిసివస్తుందనుకుంటున్నారట. అయితే ఎంత హిందీ మార్కెట్ ఉన్నా ఐదు కోట్లు అనేది చాలా పెద్ద మొత్తం అని ప్రక్కన పెట్టేస్తున్నారట.
 
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే...బాలీవుడ్‌లో మాత్రం కైరా చాలా తక్కువ తీసుకుంటోందిట. అక్కడ ఆఫర్స్ దక్కించుకోవాలంటే ముందు పారితోషికంలో పట్టువిడుపులు ప్రదర్శించాలన్న సంగతి మొదట్లోలోనే గ్రహించి, రెమ్యునరేషన్‌ విషయంలో మిగతావారికన్నా తక్కువే తీసుకోవడం మొదలెట్టిందట. దానికి తోడు.. స్కిన్‌షో, గ్లామర్‌ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని బాహాటంగానే చెప్తూండంతో ఇప్పుడు ఉత్తరాదివారికే కాకుండా  దక్షిణాదివారికి కూడా కైరా అద్వానీ కావలసిన హీరోయిన్‌ అయిపోయింది. ఇవన్నీ గమనిస్తున్న వారు కైరాలో బతకనేర్చిన తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయనీ అందుకే వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోందనీ టాలీవుడ్‌ జనాలంటున్నారు. ఏదైమైనా కైరా దిగి రాకపోతే తెలుగులో మాత్రం సినిమాలు ఉండవనేది నిజం.