కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ ఆపత్కాలంలో ప్రజలను ఆదుకునేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. తమ వంతుగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ స్టార్ హీరో అల్లు అర్జున్‌.. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళకు కూడా విరాళం ప్రకటించాడు. దీంతో తమ రాష్ట్రంలో కరోనా నిర్మూలనకు చేయూతనిచ్చిన అల్లు అర్జున్ ని ప్రత్యేకంగా అభినందించింది కేరళ సర్కార్.

తెలుగు రాష్ట్రాలతో సమానంగా తమను కూడా ఆదుకోవాలన్న బన్నీ ఆలోచన గొప్పదంటూ ప్రశంసించారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. లాక్ డౌన్ ప్రకటన వెలువడగానే.. బన్నీ కోటి ఇరవై అయిదు లక్షలు విరాళం ప్రకటించారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు.. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి పాతిక లక్షలు అందజేశారు. తమకు సాయం అందించినందుకు అల్లు అర్జున్‌ను అభినందించింది కేరళ సర్కార్.

బన్నీకి కేరళ ప్రజలు రుణపడివుంటారన్నారు కేరళ సీఎం విజయన్. బన్నీకి తెలుగు రాష్ట్రాలకు ధీటుగా మలయాళ ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ వుంది. ఇటీవల కాలం అల్లు అర్జున్‌ సినిమాలన్నీ తెలుగుతో పాటు మలయాళంలోనూ ఒకేసారి రిలీజ్ అవుతాయి.  వసూళ్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అక్కడి ఆడియెన్స్ బన్నీని ముద్దుగా మల్లు అర్జున్ అని ప్రేమగా పిలుచుకుంటారు. గతంలో.. ప్రతిష్టాత్మక పడవ పోటీలకు బన్నీని ముఖ్య అతిథిగా పిలిచి సత్కరించింది కేరళ సర్కార్. ఇప్పుడు కేరళలో కరోనా నివారణకు సాయం ప్రకటించి.. అక్కడి ప్రజలతో పాటు ప్రభుత్వం మెప్పును పొందాడు స్టైలిష్ స్టార్‌.