సైరా విడుదల తర్వాత కూడా చిరంజీవి బిజీగా గడుపుతున్నారు. హిస్టారికల్ మూవీ కావడంతో రాజకీయ ప్రముఖుల్ని కలసి సైరా చిత్రం చూడాలని ఆహ్వానిస్తున్నారు. అక్టోబర్ 2న విడుదలైన సైరా అభిమానుల్లో ఉన్న భారీ అంచనాలని అందుకుంది. 

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ ఈ చిత్రాన్ని 250 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మించాడు. సైరా విడుదలకు ముందు ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడిపిన చిరు ఇప్పుడు వరుసగా రాజకీయ ప్రముఖుల్ని కలుసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై  కలసిన మెగాస్టార్ సైరా చిత్రం చూడాల్సిందిగా ఆహ్వానించారు. చిరంజీవి ఆహ్వానం మేరకు ఆమె సైరా చిత్రం చూడడం జరిగింది. 

నేడు(సోమవారం) చిరంజీవి ఏపీ సీఎం వైఎస్ జగన్ ని తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. తన సతీమణి సురేఖ సమేతంగా చిరు జగన్ ని కలుసుకోవడం విశేషం. ఈ మేరకు సైరా చిత్రం చూడాల్సిందిగా చిరంజీవి జగన్ ని కోరారు. 

ఇదిలా ఉండగా చిరంజీవి ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలుసుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కానీ కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని వినికిడి. ప్రస్తుతం తెలంగాణాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతున్న పరిస్థితులలో చిరంజీవితో భేటీ కావడం సరైంది కాదని కేసీఆర్ భావించారట. 

పరిస్థితులు చక్కబడ్డాక చిరుకి అపాయింట్ మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ కుటుంబంతో చిరంజీవి ఫ్యామిలీకి మంచి సాన్నిహిత్యం ఉంది. రాంచరణ్ నటించిన ధృవ, వినయ విధేయ రామ చిత్రాల ఈవెంట్స్ కి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. 

సైరా చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు కూడా కేటీఆర్ హాజరు కావాల్సింది. కానీ తన రాజకీయ కార్యక్రమాల కారణంగా కేటీఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరు కాలేదు.