కరోనా ప్రభావంతో దేశమంతా ఇంటికే పరిమితమైంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరు గడపదాటాలంటే భయపడుతున్నారు. దేశంలో 21 రోజుల పాటు లాక్‌ డౌన్‌ విధించటంతో సినిమా షూటింగ్ లు రిలీజ్‌ లు ప్రమోషన్‌ కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. దీంతో హీరోలు, హీరోయిన్లు తమ నివాసాల్లోనే ఉంటూ రకరకాల పనుల్లో బిజీ అవుతున్నారు. ఎక్కువ మంది తారలు తమ వర్క్‌ అవుట్ వీడియోలను షేర్‌ చేస్తూ అభిమానులను ఉత్సాహపరుస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్ ఆసక్తికర వీడియోలను తన సోషల్ మీడియాలో పేజ్‌లో పోస్ట్ చేస్తోంది. ముందుగా అందరిలాగే వర్క్ అవుట్ వీడియోను పోస్ట్ చేసిన క్యాట్ తరువాత తన ఇంట్లో అంట్లు తోముతున్న ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసింది. అంతేకాదు తరువాత ఓ సాదారణ గృహిణిలా ఇళ్లు ఊడుస్తూ ఆ వీడియోను కూడా అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ వీడియోతో పాటు స్టే హోం (ఇంట్లోనే ఉండండి) అనే హ్యాష్ ట్యాగ్‌ను యాడ్ చేసింది. ఈ వీడియోపై అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే కత్రినా కైఫ్ చివరగా  2018లో రిలీజ్‌ అయిన భారత్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌కు జోడిగా నటించింది క్యాట్. ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో అక్షయ్‌ కుమార్ హీరోగా తెరకెక్కుతున్ యాక్షన్‌ డ్రామా సూర్యవంశీ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌ కు రెడీ అయినా కరోనా అవుట్ బ్రేక్‌ కారణంగా వాయిదా పడింది.