ఆర్ఎక్స్100 సినిమాతో ఎవరు ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న యువ హీరో కార్తికేయ ఆ తరువాత అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయాడు. 'హిప్పీ' - 'గుణ 369' సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాడు. ఇప్పుడు ఎలాగైనా అభిమానులను మెప్పించి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని మరొక డిఫరెంట్ ప్రాజెక్ట్ తో సిద్దమవుతున్నాడు. అదే '90ml'. 
అశోక్ రెడ్డి గుమ్మ కొండా నిర్మిస్తున్న ఈ సినిమాకు శేఖర్ రెడ్డి యెర్ర దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, సాంగ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ''నీతో కలిసి చచ్చేంత ప్రేమ నాలో ఉంది.. నాతో కలిసి బతకాలన్న ఆలోచనే నీలో లేదు.. ఐ హేట్‌ యూ''అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది.

కథ ప్రకారం సినిమాలో హీరో చిన్నప్పటి నుండి 90ml మందు తీసుకుంటాడు.. అది అతడికి అవసరం. ఒక్క రోజు కూడా మందు తాగకుండా ఉండలేని హీరో అసలు మందు అంటేనే పడని ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని ప్రేమిస్తాడు. తన ప్రేమ, అమ్మాయి కుటుంబసభ్యులతో ఎదురైన సంఘటనల చుట్టూ ట్రైలర్ ని కట్ చేశారు.

ట్రైలర్ అయితే ఇంటరెస్టింగ్ గానే ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ ట్రైలర్‌కు నెటిజన్లు ఫిదా అవడంతో సోషల్ మీడియాలో  తెగ వైరల్‌ అవుతోంది. రవి కిషన్‌, రావూ రమేష్‌, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే నెల డిసెంబర్ 5న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.