బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్న సీరియల్ కార్తీక దీపం. సున్నితమైన కథాంశంతో... ఎలాంటి వ్యంగ్యార్థాలు లేకుండా సీరియల్ ని నడిపిస్తూ వస్తున్నారు. అందుకే ఈ సీరియల్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

నేటి ఎపిసోడ్ లో.... సరోజక్కతో దీప మాట్లాడుతూ ఉంటుంది. ఇంత పొద్దునే డాక్టర్ బాబు ఇంటికి ఎందుకు వెళ్లిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో... సౌందర్య, ఆనందరావులు తాపీగా కూర్చొని టీ తాగుతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే హిమ.. తన తండ్రి కార్తీక్ తో కలిసి కిందకు దిగుతూ ఉంటుంది. అది చూసి వస్తోంది పిడుగు అంటుంది సౌందర్య. అక్కడ ఇంకో పిడుగు ఏం చేస్తుందో అని శౌర్యను ఉద్దేశించి అంటుంది.

అంతలోనే శౌర్య.. చేతిలో ఓ కవరు పట్టుకొని లోపలికి వస్తుంది. అది చూసిన ఆనందరావు.. ఇంకో పిడుగు అక్కడ లేదు.. ఇక్కడికే వచ్చింది అంటాడు. శౌర్య రాకను కార్తీక్, హిమ కూడా చూస్తారు. 

వెంటనే కార్తీక్.. శౌర్యను చూసి.. ఏంటి రౌడీ ఇలా వచ్చావు అని అడుగుతాడు. మీ ఇంటికి ఒకరిని తీసుకువచ్చాను. వాళ్లు మీ కాళ్లమీద పడతారు అని చెబుతుంది. అందరూ మనసులో కంగారుపడిపోతారు. శౌర్య నిజం తెలిసి దీపను తీసుకువచ్చిందా..? దీప ఇప్పుడు కార్తీక్ కాళ్ల మీద పడుతుందా అని అనుకుంటూ ఉంటారు. ఒక్క మాటతో శౌర్య అందరికీ ముచ్చెమటలు పట్టిస్తుంది.

అంతలో శౌర్య.. వాళ్ల లక్ష్మణ్ మామను తీసుకువస్తుంది. అతన్నిచూసి అందరూ ఊపిరి పీల్చుకుంటారు. అతనికి ఇంట్లోవాళ్లను పరిచయం చేస్తూ.. శౌర్య తన తెలివి అంతా చూపిస్తుంది. ఇది మా నాన్న అమ్మ ఇళ్లు అంటూ బాగా కవర్ చేస్తుంది. వీళ్లంతా మాకేమీ కారు.. కానీ నన్ను బాగా చూసుకుంటారు అంటూ.. కౌంటర్ వేస్తుంది. అతను వచ్చి కార్తీక్ కాళ్ల మీద పడి థ్యాంక్స్ చెబుతాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

ఆ తర్వాత శౌర్య.. కార్తీక్ తో... డాక్టర్ బాబు మీరు మంచివారేనా అని అడుగుతుంది. అదేంటి రౌడీ అలా అడిగావు?  అని అంటాడు కార్తీక్. మా లక్ష్మణ్ మామకు ట్రీట్మెంట్ చేసి రూ.పదివేలు ఇచ్చారు కదా మంచివాళ్లే అంటుంది. మళ్లీ తనే.. కానీ మా డాడీ గురించి తెలిసి కూడా ఎందుకు చెప్పడం లేదు అంటే.. కొంచమే మంచివాళ్లా అంటుంది.

శౌర్య ప్రశ్నకి అక్కడ ఉన్నవారెవరికీ నోట మాట రాదు. హిమ తేరుకొని.. మా డాడీ అబద్ధాలు చెప్పరు శౌర్య.. మీ డాడి నిజంగానే రారు.. నువ్వు ఆశలు వదులుకో అని సలహా ఇస్తుంది. వెంటనే శౌర్య.. మా డాడీ రారు అని చెప్పారు కానీ... తెలీదు అని చెప్పలేదు కదా హిమ అంటుంది. అంతే.. అందరూ మరోసారి షాకౌతారు.

ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న ఓ కవర్ లో నుంచి షర్ట్ తీసి.. మా నాన్న కోసం నేను ఇది కొన్నాను డాక్టర్ బాబు. మీరు ఈ షర్ట్ సరిపోతుందని చెప్పారు. గుర్తుందా అని అడుగుతుంది. మీరేమో మా నాన్న లావుగా ఉంటారని చెప్పారు. కానీ మా నాన్న తెలిసిన ఓ వ్యక్తి మాత్రం అచ్చం మీ లాగానే ఉంటారని చెప్పారు. అని అంటుంది.

ఆ తర్వాత తన  చేతిలోని షర్ట్ కార్తీక్ చేతిలో పెట్టి.. మా నాన్న గురించి అడగను కానీ... ఈ షర్ట్ తీసుకువెళ్లి.. మీ కూతురు ఇచ్చిందని చెప్పి ఇవ్వండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కార్తీక్ ఆ షర్ట్ ని విసిరేయాలని అనుకుంటాడు.. కానీ హిమ ను చూసి ఆగిపోతాడు.

శౌర్య గురించి, కార్తీక్ గురించి ఆనందరావు ఆలోచిస్తూ ఉంటాడు. అటు వచ్చిన సౌందర్య దేని గురించి ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. శౌర్య బాధ అందరికీ అర్థమౌతోంది.. కార్తీక్ మాత్రం ఎందుకు అర్థం కావడం లేదూ అని ఆవేదన వ్యక్తం చేస్తాడు. వెంటనే సౌందర్య.. శౌర్యకు నిజం తెలిసిపోయిందేమో అని నాకు అనిపిస్తోంది అంటుంది. దానికి ఆనందరావు... శౌర్య.. నీలాంటిది సౌందర్య.. నిజం తెలిస్తే.. వెంటనే కార్తీక్ కాలర్ పట్టుకొని నిలదీసేది అని చెబుతాడు.

ఆ తర్వాత దీప.. వారణాసి ఆటోలో స్కూల్ కి వెళ్తుంది. అక్కడ హిమ.. దీప గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మా డాడీని పెళ్లి చేసుకో వంటలక్క అని అడిగితే.. శౌర్య లాగానే కొడుతుందని అనుకున్నాను. కానీ కొట్టలేదు.. అలా అని ఏమీ మాట్లాడలేదు అని అనుకుంటూ ఉంటుంది. అంతలో దీప కనపుడుతుంది. వెంటనే హిమ.. వంటలక్క అని పరుగు తీస్తుంది.