పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో అధికారిక ప్రకటన వచ్చే వరకు తెలియదు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ప్రతి ఏడాది తన మామిడి తోటలోని పండ్లని కొందరు ప్రముఖుల ఇళ్లకు పంపుతుంటాడు. 

ఈ ఏడాది ఊహించని విధంగా టివి సీరియల్ హీరో నిరుపమ్ ఇంటికి పవన్ కళ్యాణ్ మామిడి పండ్లు వెళ్లాయి.  పవన్ కళ్యాణ్ టీవీ నటుడి ఇంటికి మామిడిపండ్లు పంపడం ఆసక్తికర అంశమే. కానీ నిరుపమ్ కు ఆ మామిడి పండ్లు పంపింది పవన్ కాదు. పవన్ తల్లి అంజనా దేవిగారు. ఈ విషయాన్ని నిరుపమ్ స్వయంగా వేదికపై తెలిపాడు. 

టివి నటులకు అవార్డులు అందజేసే 'స్టార్ మా పరివార్ అవార్డ్స్' ఇటీవల ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో కార్తీక దీపం సీరియల్ కు గాను నిరుపమ్ అవార్డు అందుకున్నాడు. అవార్డు అందుకున్న తర్వాత నిరుపమ్ మాట్లాడుతూ.. టివి సీరియల్ లో నటించి మెప్పించాలంటే ఏడాది మొత్తం కష్టపడుతూనే ఉండాలి. మా కష్టానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వచ్చినప్పుడే సంతోషంగా ఉంటుంది. 

ఇటీవల మా ఇంటికి కొన్ని మామిడి పండ్లు ఉన్న బుట్టని ఇద్దరు వ్యక్తులు తీసుకువచ్చారు. ఈ పళ్ళు ఎక్కడివి, ఎవరు పంపారు అని అడగగా.. పవన్ కళ్యాణ్ గారి మామిడి తోట నుంచి తీసుకువస్తున్నాం.. ఆయన తల్లి అంజనాదేవిగారు మీకు ఈ పళ్ళు పంపారు అని తెలిపారు. 

కార్తీకదీపం సీరియల్ లో నా నటన అంజనాదేవిగారికి చాలా బాగా నచ్చిందట. ఆమె నాకు శుభాకాంక్షలు చెబుతూ ఈ పళ్ళు పంపారు అని నిరుపమ్ అసలు విషయాన్ని తెలిపాడు.  ఇలాంటి అభినందనలు విన్నప్పుడు మా కష్టం మొత్తం మరచిపోతాం అని నిరుపమ్ తెలిపాడు.