తమిళ సినిమా డబ్బింగై వస్తోందంటే ఒకప్పుడు చాలా ఆసక్తిగా చూసే పరిస్దితి. అయితే అలా వచ్చిన చాలా సినిమా లు అంత సీన్ లేదు అని వెక్కిరించేయటంతో..బాగుందంటేనే టిక్కెట్ లు తెగుతున్నాయి. ఈ ప్రవాహంలో ఒకప్పుడు క్రేజ్ తెచ్చుకున్న కార్తీ, సూర్యలు కొట్టుకుపోయారు. అయితే తను తెలుగులో నచ్చటానికి కారణం కార్తీ వెనక్కి వెళ్లి అన్వేషించుకున్నట్లున్నాడు..కంటెంట్ ప్రధాన చిత్రాలతో పలకరిస్తున్నారు. ఆ క్రమంలో వచ్చిన చిత్రమే మొన్నా మధ్యన వచ్చిన ఖాఖీ. ఇప్పుడు ఖైధీ. రిలీజ్ కు ముందు పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోయిన ఈ చిత్రం ఎలా ఉంది...కథేంటి..ఇదేమన్నా ప్రయోగాత్మక చిత్రమా...కార్తీ కెరీర్ కు ఏమన్నా ప్లస్ అవుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి..

800కోట్ల విలువ చేసే డ్రగ్స్ ని పోలీస్ లు పట్టుకుని, ఎస్.పి ఆఫీస్ లో దాస్తారు. అయితే అంత విలువైన సరుకుని దాచటం అంత తేలికైన పనికాదు అని వాళ్లకు తొందరలోనే తెలిసి వస్తుంది. ఆ డ్రగ్స్ గ్యాంగ్ వాళ్లు....తమను పట్టుకున్న పోలీస్‌ ఉన్నతాధికారులు, ముఖ్యమైన ఆఫీసర్లు అందరికీ డ్రగ్స్‌ ఇచ్చి ఆ మాల్ ఎస్పీ ఆఫీస్‌ మీద ఎటాక్‌ చేయడానికి రెడీ అవుతారు.  అప్పుడా ఆ ముఠాని సాహసంగా బిజయ్‌(నరైన్‌) అనే ఓ పోలీస్ అధికారి  అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు. ఆ క్రమంలో  ఈ ఆఫీసర్లని భద్రంగా లారీలో తీసుకుని వెళ్లి హాస్పిటల్‌ చేర్చే బాధ్యతను  ఢిల్లీ(కార్తీ) కి అప్పగిస్తారు.డిల్లీ ఏమన్నా పోలీస్ ఆఫీసరా అంటే కాదు..ఓ ఖైదీ.

పదేళ్ల జైలు శిక్ష అనుభవించి, అంతవరకు కనీసం చూడను కూడా చూడని కూతుర్ని చూడ్డానికి వెళుతూంటాడు డిల్లీ.  ఈ భాథ్యతకి మొదట్లో డిల్లీ అంగీకరించకపోయినా చివరికీ కూతురు భవిష్యత్తు కోసం ఆ పనికి  ఓకే అంటాడు. ఆ భాధ్యత  ప్రకారం..ఓ లారీలో ఎన‌భై కిలోమీట‌ర్లు తీసికెళ్లి, చెప్పిన ప్ర‌దేశంలో వారిని దింపాలి.సరేనని బయిలుదేరతాడు.  ఆ డెసిషన్ తో  ఢిల్లీ  వరస స‌మ‌స్య‌ల‌లో  చిక్కుకోవాల్సివ‌స్తుంది...అవేమిటి... పోలీసులను చంపడానికి తిరుగుతున్న డ్రగ్ గ్యాంగ్స్ నుండి ‘ఢిల్లీ’ వాళ్ళను ఎలా సేవ్ చేశాడు...అనేవి తెలియాలంటే ఖైదీ చూడాల్సిందే.
 
కథ,కథనం

ఈ సినిమా కథని మొదట అరగంటలోనే పూర్తిగా సెటప్ చేయటంతో దర్శకుడుకు స్క్రీన్ ప్లే పై ఉన్న పట్టేంటో అర్దమవుతుంది.  డ్రగ్స్ కలిపిన  మద్యం తాగిన పోలీసుల్ని ఎవరికీ తెలియకుండా ఆసుపత్రికి తీసుకెళ్లడం.. ఆ తర్వాత భారీగా డ్రగ్స్ నిల్వ ఉన్న ఎస్ .పి ఆఫీస్ కి చేరుకుని అక్కడున్న వాళ్లను కాపాడి సరకు బయటికి వెళ్లకుండా చూడటం హీరో బాధ్యతలుగా సెట్ చేసేయటంతో తర్వాత ఏం జరుగుతుందే క్యూరియాసిటీ అడుగడుక్కీకనపడుతుంది. ఈ ప్రయాణంలో హీరోకి ఎదురైన అడ్డంకుల్ని ఎలా అధిగమిస్తూ తన బాధ్యతల్ని పూర్తి చేశాడన్నది మిగతా సినిమా కథగా మారిపోయింది. ఇలా క్లారిటీతో కథను రన్ చేయటమే కలిసి వచ్చింది.

నాలుగు గంటల్లో జరిగే ఈ కథకు స్క్రీన్ ప్లేనే ప్రధానం. ఆ విషయం అర్దం చేసుకున్న దర్శకుడు టైట్ స్క్రీన్ ప్లే తో కథను పరుగెత్తించాడు. ఎక్కడా కమర్షియల్ ఎలిమెంట్స్ చొప్పించే ప్రయత్నం చేయలేదు. ఓ హాలీవుడ్ చిత్రం సినిమా కథలా నీటుగా స్ట్రైయిట్ గా నేరేట్ చేసుకుంటూ పోయాడు. ఇలాంటి కథ చేసుకున్న దర్శకుడది ఎంత సాహసమో ..అంతకు రెట్టింపు..ఇలాంటి కథను తనతో చేయటానికి ఒప్పుకున్న హీరో కార్తీది. ఎందుకంటే ఈ కథలో చివరకు హీరోయిన్ కూడా లేదు. డాన్స్ లు, పాటలు లేవు. మరీ ముఖ్యంగా హీరోయిజం కోసం తయారు చేసిన స్పెషల్ సీన్స్ లేవు.

లోపాలు..

ఇంత బాగున్న సినిమాలోనూ కొన్ని లోపాలు లేకపోలేదు. సెకండాఫ్ లో సీన్స్ బాగా స్లో గా నడుస్తూంటాయి. కథ చెప్పుకోదగింది లేక సీన్స్ రిపీట్ అవుతూ సాగుతున్నట్లు అనిపిస్తుంది. అలాగే ఒక్కోచోట హీరో ఫైట్స్ చూస్తూంటే అప్పటిదాకా వాస్తవంగా జరుగుతన్నట్లు అనిపించిన కథ మళ్లీ రొటీన్ కమర్షియల్ ఫార్మెట్ లోకి వెళ్లిపోయినట్లు అనిపిస్తుంది. వీటిని పట్టించుకోకుండా ఉంటే ఈ సినిమా చాలా కొత్తగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లు పెద్దగా లేకపోవటం, అందులో హీరోయిన్ లేకపోవటం చాలా రిలీఫ్ గా  బాగుంటుంది. అయితే సెకండాఫ్ లో ఏవైనా ట్విస్ట్ లు వస్తాయనుకున్న ఎదురుచూస్తే నిరాశ పరిచారు.

టెక్నికల్ గా ..

ఈ  సినిమా పూర్తిగా రాత్రి పూట జరగటంతో...కెమెరా డిపార్టమెంట్ కే ఎక్కువ పని పడింది. అయితే  సినిమాటోగ్రఫర్ ..తన టాలెంట్ తో  మెచ్చుకునేలా సీన్స్ తీసారు. పాటలు లేకపోయినా  బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ అదరకొట్టారు.  ఫైట్‌ మాస్టర్స్‌ కొన్ని చోట్ల ఓవర్ చేసినట్లు అనిపించినా..ఓవరాల్ గా  కొత్త యాక్షన్‌ సీన్స్‌ డిజైన్  చేశారు. ఎడిటింగ్‌ ఓ ఇరవై నిముషాల ట్రిమ్ చేయాల్సింది వదిలేసినట్లుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాకు తగ్గట్లు ఉన్నాయి.   ఇక నటీనటుల్లో కార్తీ,విలన్ పాత్రలో కనిపించిన రమణ అదరకొట్టారు.

ఫైనల్ థాట్

కార్తీ కెరీర్ కుంటుపడకుండా ఉండాలంటే ఇలాంటి  ‘ఖైదీ’ల సాయం అత్యవసరం.

Rating:3/5

ఎవరెవరు..

నటీనటులు: కార్తి, నరైన్‌, జార్జ్‌ మార్యన్‌, రమణ, వాట్సన్‌ చక్రవర్తి తదితరులు
సంగీతం: శామ్‌ సీ.ఎస్‌.
ఎడిటింగ్‌: ఫిలోమిన్‌ రాజ్‌
నిర్మాత: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు
దర్శకత్వం: లోకేశ్‌ కనకరాజు
బ్యానర్‌: డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, వివేకానంద ఫిల్మ్స్‌
విడుదల తేదీ: 25-10-2019