రణబీర్ కపూర్, అలియా భట్ ల ప్రేమ గురించి బాలీవుడ్ లో అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి చెట్టాపట్టాలు వేసుకొని తిరగడం, కలిసి ఈవెంట్ లకు వెళ్లడం వంటివి చేయడంతో బీటౌన్ లో వీరి రిలేషన్ పై పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరి పెళ్లి టాపిక్ బాలీవుడ్ లో హాట్ టాపిక్. ఈ క్రమంలో రణబీర్ కి వరుసకి సోదరి స్టార్ హీరోయిన్  కరీనా కపూర్ అతడి రిలేషన్ గురించి స్పందించారు.

అలియాభట్, కరీనా కపూర్ కలిసి కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న షోకి హాజరయ్యారు. ఈ సందర్భంగా కరణ్.. అలియాను ఉద్దేశిస్తూ.. 'నీ జీవితంలో ఎప్పుడైనా కరీనా కపూర్ నీకు వదిన అవుతుందని అనుకున్నావా..?' అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అలియా కంటే ముందే కరీనా స్పందించింది. 'అలియా నాకు మరదలైతే.. నాకంటే ఎక్కువ సంతోషించే వారు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు' అని చెప్పింది.

ఆ మాట విన్న అలియా సిగ్గు పడుతూ టాపిక్ మార్చే ప్రయత్నం చేసింది. అయినా కరణ్ వదలకుండా.. 'ఒకవేళ నీకు, రణబీర్ కి వివాహం అయితే గనున నేను కరీనా చాలా సంతోషిస్తామని.. థాలీతో ఎదురుచూస్తుంటామని' అన్నారు. వివాహం జరిగిన తరువాత కూడా కరీనాలానే మీ కెరీర్ ని కొనసాగించాలని కరణ్.. అలియాకి సూచించారు. ఈ వ్యాఖ్యలను అలియా సపోర్ట్ చేస్తూ మాట్లాడారు.

గతంలో ఓ హీరోయిన్ కి వివాహం జరిగిందంటే.. ఆమె కెరీర్ ముగిసిపోయినట్లేనని భావించేవారని, కానీ కరీనా వీటన్నింటినీ బద్దలుగొట్టారని చెప్పారు. వ్యక్తిగత జీవితం, కెరీర్ రెండింటినీ ఆమె బాగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారని.. ఆమె దగ్గర పని చేసే వారంతా కరీనా గురించి ఎంతో గొప్పగా చెప్తారని అన్నారు. ఈ ఏడాది 'గల్లీ బాయ్', 'కలంక్' వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అలియా.

'గల్లీ బాయ్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ రణబీర్ తో కలిసి 'బ్రహ్మాస్త్ర' సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'RRR' అలానే 'సడక్ 2' వంటి చిత్రాల్లో నటిస్తోంది.