బుల్లితెర స్టార్ కమెడియన్ కపిల్ శర్మ గురించి పరిచయం అవసరం లేదు. కపిల్ శర్మ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కపిల్ లక్షలాది మంది అభిమానులని సొంతం చేసుకున్నాడు. కపిల్ శర్మ చేసే సెటైర్లకు సల్మాన్ ఖాన్ లాంటి బడా స్టార్లు సైతం పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే. 

ప్రతి సెలెబ్రిటీ ఏదో ఒక సందర్భంలో వివాదంలో చిక్కుకుంటుంటారు. కపిల్ శర్మ కూడా అందుకు అతీతం కాదు. మార్చి 28న ప్రసారమైన కపిల్ శర్మ షో వివాదానికి కారణం అయింది. ఆ షోలో కపిల్ శర్మ హిందువులు దైవంగా భావించే చిత్రగుప్తుడిపై జోకులు వేశారు.  చిత్ర గుప్తుడి గొప్పతనాన్ని అపహాస్యం చేసే విధంగా కామెంట్స్ చేశారు. 

హిందూ పురాణాల ప్రకారం చిత్రగుప్తుడంటే మానవుల పాప పుణ్యాలని లెక్కించే దేవుడు. కాయస్థ అనే సామాజిక వర్గం చిత్రగుప్తుడిని ఆరాధ్య దైవంగా పూజిస్తారు. దీనితో కాయస్థ సామజిక వర్గం కపిల్ శర్మపై ఆగ్రహంతో ఉన్నారు. 

ఇటీవల అఖిల భారత కాయస్థ సామజిక వర్గ అధినేత స్వయంగా ఫోన్ చేసి కపిల్ శర్మకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చిత్రగుప్తుడిపై చేసిన వ్యాఖ్యలకు గాను బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకుంటే కేసు నమోదు చేసి కపిల్ శర్మ షో బ్యాన్ అయ్యేలా చర్యలు తీసుకుంటాం అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. 

దీనితో తాజాగా కపిల్ శర్మ సోషల్ మీడియా వేదికగా కాయస్థ సామజిక వర్గానికి క్షమాపణలు తెలిపాడు. ఎవ్వరిని కించపరిచే ఉద్దేశం తనకు లేదని కపిల్ పేర్కొన్నాడు. అందరూ సంతోషంగా నవ్వుతూ ఉండడమే తాను కోరుకుంటానని కపిల్ చెప్పుకొచ్చాడు.