కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నటి మెబీనా(22) మరణించారు. అతి పిన్న వయసులో ఆమె మరణించడంతో కుటుంబ సభ్యులు, కన్నడ బుల్లితెర ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే.. 

నటి మెబీనా కన్నడలో పలు టివి సీరియల్స్ తో నటిస్తోంది. ఆమె మోడల్ గా కెరీర్ ప్రారంభించి నటన వైపు వచ్చింది. రంగుల ప్రపంచంలో ఎదగాలని భావించిన మెబీనా కలలు చిన్నాభిన్నమయ్యాయి. మెబీనా బెంగుళూరు నుంచి కారులో తన స్నేహితులతో హోమ్ టౌన్ మడికేరికి బయలుదేరింది. 

కారులో వెళుతుండగా మధ్యలో ఆమె కారు ఓ ట్రాక్టర్ ని ఢీకొన్నట్లు తెలుస్తోంది. దీనితో తీవ్రగాయాలతో మెబీనా మృతి చెందింది. ఆమె స్నేహితులు గాయాలపాలయ్యారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మెబీనా స్నేహితులు కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. 

మెబీనా మృతి ఆమె కుటుంబ సభ్యుల్లో సన్నిహితుల్లో తీవ్ర విషాదంగా మారింది. మెబీనా కన్నడలో ప్రసారం అయ్యే రియాలిటీ షో 'ప్యాతే హుడిగిరి హళ్లి లైఫ్ సీజన్ 4 లో పాల్గొని విజేతగా నిలిచింది. ఆయా రియాలిటీ షో హోస్ట్ అయిన ప్రముఖ నటుడు అకుల్ బాలాజీ.. మెబీనా మృతిపట్ల దిగ్బ్రాంతికి గురయ్యారు. ఇంకా ఎంతో జీవితం అనుభవించాల్సిన మెబీనా ఇలా మృతిచెందడం జీర్ణించుకోలేని విషయం అని అకుల్ అన్నారు.