వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మరో సంచలన చిత్రం కమ్మ రాజ్యంలో కడపరెడ్లు. టైటిల్ లోనే అలా వివాదాలకు తెరలేపిన వర్మ.. సినిమాలో పలువురు రాజకీయ ప్రముఖుల్ని టార్గెట్ చేయబోతున్నాడు. తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ దీపావళి కానుకగా విడుదలయింది. 

ఈ చిత్రంలో వర్మ పూర్తిగా ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తున్నాడు. వైయస్ జగన్ పాత్రని హైలైట్ చేస్తూ మిగిలిన రాజకీయ ప్రముఖులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాడు. బ్రేకింగ్ న్యూస్.. మూడుసార్లు ముఖ్యమంత్రి చేసిన బాబు పార్టీ చరిత్రలోనే ఎన్నడూ చూడని పరాజయాన్ని చవిచూసిన తర్వాత కొన్ని విపరీత పరిస్థితులు ఏర్పడుతున్నాయి' అంటూ వర్మ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. 

ఈ చిత్రంలో వర్మ ముఖ్యంగా కొన్ని అంశాలని టార్గెట్ చేయబోతున్నట్లు స్పష్టం అవుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ విజయం.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో మారిన రాజకీయ పరిస్థితులని వర్మ చూపించబోతున్నాడు. ఇందులో భాగంగా జగన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలని వర్మ హైలైట్ చేస్తున్నాడు. 

బెజవాడ రౌడీయిజంపై ఈ చిత్రంలో కీలక సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడలో ప్రశాంత వాతావరణాన్ని తేవాలి అంటూ జగన్ పాత్రలో ఉన్న అజ్మల్ చెబుతున్న డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. 

ఎన్నికల్లో ఓటమి తర్వాత.. ఆ దేవుడే నన్ను వెన్నుపోటు పొడిచాడు వర్మ అంటూ చంద్రబాబు పాత్రలో ఉన్న నటుడు చెబుతున్న డైలాగ్ కూడా ఆసక్తి రేపుతోంది. నారా లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్ పై కూడా వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ముఖ్యంగా నారా లోకేష్ పాత్రలో ఉన్న వ్యక్తిని చంద్రబాబు పాత్రలో ఉన్న నటుడు పళ్లెం లో పప్పు వేస్తున్న దృశ్యం వివాదం అయ్యేలా ఉంది. 

మొత్తంగా వర్మ తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం ట్రైలర్ తోనే హాట్ టాపిక్ గా మారింది.