ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌భుత్వాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుండ‌గా, ప్ర‌ముఖులు కూడా త‌మ వంతు సాయం అందించేందుకు ముందుకు వ‌స్తున్నారు. ఇప్ప‌టికే సెల‌బ్రిటీలు ఆర్థిక సాయం అందిస్తుండ‌గా కోలీవుడ్ స్టార్ హీరో, లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ మ‌రో అడుగు ముందుకు వేశాడు. త‌న వంతు సాయంగా ఆర్థిక సాయంతో పాటు త‌న ఇంటినీ ఈ క్లిష్ట ప‌రిస్థితుల్లో ఆసుపత్రి వాడుకొవ‌చ్చ‌ని చెప్పాడు. అందుకు ప్ర‌భుత్వం అనుమ‌తించాల్సిందిగా ఆయ‌న కోరాడు. ఇప్ప‌టికే రోజువారి కూలిగా సినీరంగంలో ప‌నిచేస్తున్న వారి కోసం భారీ ఆర్ధిక సాయాన్ని కూడా ప్ర‌క‌టించాడు క‌మ‌ల్‌.

ఈ నేప‌థ్యంలో క‌మ‌ల్ నిర్ణ‌యం ప‌ట్ల ఆయ‌న అభిమానుల‌తో పాటు అన్ని వ‌ర్గాల నుంచి ప్ర‌శంస‌లు వస్తున్నాయి. క‌రోనా పేరు చెపితేనే భ‌య‌ప‌డి పారిపోతున్న పరిస్థితుల్లో ఏకంగా త‌న ఇంటినే వారికోసం ఆసుప‌త్రిగా మార్చేందుకు ముందుకు వ‌చ్చిన క‌మ‌ల్‌ను అభినందిస్తున్నారు. క‌మ‌ల్ హాస‌న్ తో పాటు ర‌జ‌నీకాంత్‌, ధ‌నుష్‌, సూర్య‌, కార్తీ, శివ కార్తికేయ‌న్ లాంటి హీరోలు కూడా త‌మ వంతుగా ఆర్ధిక సాయాన్ని ప్ర‌క‌టించారు. తమిళ‌నాడులోనూ ఈ వైర‌స్ వేగంగా సోకుతుండ‌టంతో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ దేశాల‌ను వణికిస్తోంది. ఇప్ప‌టికే ఈ వైర‌స్ కార‌ణంగా 20 వేల మందికి పైగా ప్రాణాలు విడిచారు. దాదాపు 4 ల‌క్ష‌ల మందికి పైగా చికిత్స‌లో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో చాలా దేశాల్లో పేషెంట్ల‌కు టీ్ర‌ట్‌మెంట్ ఇచ్చే ప‌రిస్థితి కూడా లేదు. దీంతో మ‌ర‌ణాల రేటు భారీగా పెరుగుతోంది.