లోక నాయకుడు కమల్‌ హాసన్‌ హీరోగా సౌత్‌ గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ఇండియన్‌. సంచలన విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్‌ను నిర్మించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నో అవాంతరాల తరువాత ఇటీవలే ఈ సినిమా సెట్స్ మీదకు వచ్చింది. కమల్‌ను మరోసారి భారతీయుడిగా చూపించేందుకు ఈ సినిమా శంకర్‌ భారీ కథనే రెడీ చేశాడు.

అయితే ఈ సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. ముందుగా ఈ సినిమాను తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మించాలనుకున్నాడు. కానీ బడ్జెట్ ఎక్కువ అవుతుండటంతో ఆయన తప్పుకున్నారు. తరువాత లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. అదే సమయంలో లైకా నిర్వాకుల మధ్య వివాదాలు తలెత్తటంతో సినిమా ఆలస్యమైంది.

ఫైనల్‌గా అందరినీ ఒప్పించి సినిమాను ప్రారంభించినా సమస్యలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల షూటింగ్ సెట్‌లో ప్రమాదం జరగటం కూడా సంచలనంగా మారింది. ఈ ప్రమాదంలో అసిస్టెంట్ డైరెక్టర్లు మరణించటంతో పాటు పలువురికి గాయాలు కూడా కావటంతో షూటింగ్ వాయిదా పడింది. తాజాగా కరోనా కారణంగా షూటింగ్ మరోసారి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో నిర్మాతలు సినిమాను పూర్తిగా ఆపేసే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే ఆలస్యం కావటంతో పాటు తరుచూ అవాంతరాలు ఎదురు అవుతుండటంతో సినిమాను పూర్తిగా పక్కన పెట్టేశారు.