లోక నాయకుడు కమల్‌ హాసన్ హీరోగా సౌత్ టాప్‌ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ఇండియన్‌ 2. గతంలో ఇదే కాంబినేషన్‌లో తెరకెక్కిన ఇండియన్‌ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీగా నిర్మిస్తోంది. ముందుగా ఈ సినిమాను టాలీవుడ్‌ స్టార్ ప్రొడ్యూసర్‌ దిల్ రాజు నిర్మించేందుకు ప్లాన్ చేశాడు. కానీ బడ్జెట్ మరీ ఎక్కువ అవుతుండటంతో దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు.

తరువాత టేకోవర్‌ చేసిన లైకా సంస్థ కూడా ఈ సినిమాకు బడ్జెట్‌ పరిమితులు విధించింది. అన్నింటికీ అంగీకరించి శంకర్‌ సినిమాను ప్రాంభించిన అనేక అడ్డంకులు సినిమాను వేదిస్తున్నాయి. ఎలక్షన్‌ల కారణంగా కమల్ రాజకీయాల్లో బిజీ కావటంలో షూటింగ్ ఆలస్యమైంది. తరువాత బడ్జెట్ కారణంగా మరోసారి సినిమా ఆగిపోయిందన్న ప్రచారం జరిగింది. అన్ని అడ్డంకులు తొలగి షూటింగ్ పట్టాలెక్కగానే సెట్ లో ప్రమాదం జరిగటంతో మరోసారి షూటింగ్‌కు బ్రేక్ పడింది.

తాజాగా లాక్ డౌన్‌ కారణంగా ఈ సినిమాకు మరోసారి బ్రేక్ పడింది. ఇలా వరుస ఆటంకాలు ఎదురవుతుండటంతో సినిమాను పూర్తిగా ఆపేశారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ స్పందించింది. ఇండియన్‌ 2 సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. అంతేకాదు ఇప్పటికే 60 శాతం సినిమా షూటింగ్ పూర్తయ్యిందని మిగత భాగం లాక్‌ డౌన్‌ ఎత్తి వేసిన వెంటనే షూట్ చేస్తామని తెలిపింది. దీంతో ఇండియన్‌ ఆగిపోయిందన్న వార్తలకు తెరపడినట్టైంది.