మొన్న సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాల మద్యలో కళ్యాణ్ రామ్ తన ఎంత మంచివాడివురా సినిమాని రిలీజ్ చేయడం చాల రిస్క్ అని చాలా మంది అన్నారు. కానీ పక్కా ఫ్యామిలీ కథతో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సినిమాని పక్కా సంక్రాంతికి రిలీజ్ చేయడం కరెక్ట్.. అని రిలీజ్ చేసాడు. ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితం నమోదు చేసింది. 

అసలే అంతంతమాత్రంగా ఉన్న కళ్యాణ్ రామ్ కెరీర్ ఈ దెబ్బతో మరింత వెనక్కిపోయింది. అయితే ఈ సినిమా ఓకే చేసేముందు కూడా చాలా మంది కళ్యాణ్ రామ్ తో.. ఇంత ఫీల్ గుడ్ సినిమా ఇప్పుడు అవసరమా.. అందులోనూ నితిన్ కు శ్రీనివాస కళ్యాణం వంటి డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడుతో అని వారించారట.

అయితే ఆ సినిమా గుజరాతీ రీమేక్ కావటం,వేగెశ్న సతీష్ మీద మంచి రైటర్ గా, శతమానంభవతి వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడుగా నమ్మకం ఈ సినిమాని ఓకే చేసేలా చేసాయి. అయితే అయ్యిందేదో అయ్యిపోయింది. ఇప్పుడు మళ్లీ అలాంటి తప్పే కళ్యాణ్ రామ్ చేస్తున్నాడు అని మీడియాలో ప్రచారం జరుగుతోంది.  అదేమిటంటే...కళ్యాణ్ రామ్ తాజాగా ఓ స్క్రిప్టు ఓకే చేసాడట. రవితేజతో  డిస్కోరాజా వంటి డిజాస్టర్ ఇచ్చిన దర్శ‌కుడు వి.ఐ.ఆనంద్‌. రీసెంట్ గా క‌ళ్యాణ్‌రామ్‌కి వి.ఐ.ఆనంద్ క‌థ చెప్పాడ‌ట‌. అది ఆయ‌న‌కి బాగా న‌చ్చి వెంట‌నే గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా వివ‌రాలు బ‌య‌టికొచ్చే అవ‌కాశాలున్నాయి.

వి.ఐ.ఆనంద్ ప్ర‌తిభ‌గ‌ల ద‌ర్శ‌కుడే కాదనలేం. అలాగే డిస్కోరాజాని కూడా మేకింగ్ పరంగా బాగానే తీశాడు కానీ… స్క్రిప్టు పరంగా కొన్ని  త‌ప్పిదాలు ఆయ‌న కొంప‌ముంచాయి. ఈసారి కూడా త‌నదైన స్టైల్ లో ఓ సైన్స్ ఫిక్షన్ తరహాలో  క‌థ‌తోనే స్క్రిప్టు సిద్ధం చేసిన‌ట్టు స‌మాచారం. సైన్స్ ఫిక్షన్, డిస్కోరాజా డిజాస్టర్ వంటివి కళ్యాణ్ రామ్ అభిమానులను భయపెడుతున్నాయి. అవసరమా ఆ దర్శకుడుతో అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే కళ్యాణ్ రామ్ ఓ సారి మాట ఇస్తే ముందుకు వెళ్లిపోయే రకం. ఎంత మంచివాడివురా టైటిల్ కు తగ్గ నిజ జీవిత క్యారక్టర్ అతను.

ఇక క‌ళ్యాణ్‌రామ్ నటుడుగానే కాకుండా నిర్మాత‌గా ఈ యేడాది బిజీగా గ‌డ‌ప‌బోతున్నాడు. త‌న త‌మ్ముడు ఎన్టీఆర్ హీరోగా త్రివిక్ర‌మ్ తీయ‌బోయే సినిమాని హారిక హాసిని సంస్థ‌తో క‌లిసి నిర్మించ‌బోతున్నాడు. దాంతోపాటు మ‌రొక ఎన్టీఆర్ సినిమాని కూడా త‌న బ్యాన‌ర్‌లోనే తీయాల‌నేది క‌ళ్యాణ్ ఆలోచ‌న అట‌.